బాలీవుడ్ నటి సమీరా రెడ్డి సుమారు 15 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తుంది. 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను వివాహం చేసుకున్న సమీరా.. అంతకు ముందే సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కృష్ణం వందే జగద్గురుం (2012) మూవీలో ప్రత్యేక గీతంలో మాత్రమే ఆమె కనిపించారు. అయితే, ఇప్పుడు సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ‘ఆఖ్రీ సవాల్’లో కీలక పాత్రలో ఆమె నటిస్తుంది. ఈ చిత్రం మే 8న విడుదల కానుంది.
ఆఖ్రీ సవాల్ మూవీలో సమీరా రెడ్డి పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. తన రీఎంట్రీ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను నటించబోయే పాత్రల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నానని సమీరా వెల్లడించింది. రొటీన్ కమర్షియల్ పాత్రల కంటే, నటనకు ఆస్కారం కల్పించే అర్థవంతమైన పాత్రలపైనే తన దృష్టి ఉంటుందని ఆమె నొక్కి చెప్పింది.

ఆఖ్రీ సవాల్ చిత్రాన్ని జాతీయ అవార్డు దర్శకుడు అభిజీత్ మోహన్ వారంగ్ తెరకెక్కిస్తున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్ది ప్రయాణాన్ని కథగా రాసుకుని ఈ మూవీని తీసినట్లు సమాచారం. ఇందులో సంజయ్ దత్ ప్రొఫెసర్ గోపాల్ నాదకర్ణిగా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు నమాశి చక్రవర్తి పీహెచ్‌డీ విద్యార్థి పాత్రలో కనిపించబోతున్నాడు.
ఆఖ్రీ సవాల్ చిత్రం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌పై వచ్చిన ఆరోపణలు గురించి చూపించనున్నారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత జరిగిన ఘటనలు.. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత వంటి అంశాలను ఈ మూవీలో చూపనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్ నందా, సంజయ్ దత్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.


