స్టార్‌ వార్‌.. ఇక బాక్సాఫీస్‌ బద్దలే..!

Actors Gangwar for box office collections - Sakshi

బాక్సాఫీస్‌ వసూళ్ల కోసం గ్యాంగ్‌వార్‌కు రంగం సిద్ధమవుతోంది. ఆల్రెడీ కొందరు స్టార్స్‌ వార్‌ డిక్లేర్‌ చేసి సెట్స్‌లో బిజీగా ఉన్నారు. మరికొందరు రెడీ అవుతున్నారు. ఈ బాక్సాఫీస్‌ గ్యాంగ్‌వార్‌ పై ఓ లుక్‌ వేద్దాం.

పోలీసాఫీసర్‌గా ప్రభాస్‌ నటించనున్న సినిమా ‘స్పిరిట్‌’. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పనులు ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నాయి. ప్రభాస్‌ కెరీర్‌లో 25వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ ‘స్పిరిట్‌’ ముంబైలో జరిగే గ్యాంగ్‌వార్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఉంటుందనే టాక్‌ వినిపిస్తోంది. అలాగే సందీప్‌రెడ్డి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న హిందీ ‘యానిమల్‌’ కూడా ఇలాంటి తరహా చిత్రమే.

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా రూపొందుతున్న కంప్లీట్‌ గ్యాంగ్‌స్టర్‌ ఫిల్మ్‌ ఇది. తండ్రి కోసం ఓ యువకుడు గ్యాంగ్‌వార్‌లో ఎలా చిక్కుకున్నాడు? అనే కోణంలో ఈ సినిమా సాగుతుందని బాలీవుడ్‌ టాక్‌. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

ఇక దర్శకుడు సుజిత్‌ తెరకెక్కించనున్న సినిమాలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ టైమ్‌లో ‘దే కాల్‌ హిమ్‌ ఓజీ’ అనే ట్యాగ్‌లైన్‌ తెరపైకి వచ్చింది. ‘ఓజీ’ అంటే ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ అని ప్రచారం జరిగింది. దీంతో పవన్‌–సుజిత్‌ కాంబినేషన్‌లోని మూవీ గ్యాంగ్‌స్టర్‌ బ్యాక్‌డ్రాప్‌ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఎర్రచందనం స్మగ్లింగ్‌ సిండికేట్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమా ‘పుష్ప’. ఆల్రెడీ విడుదలైన ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’లో కొన్ని గ్యాంగ్‌వార్‌ సీన్స్‌ చూశాం. అలాగే ‘పుష్ప: ది రైజ్‌’కు కొనసాగింపుగా రానున్న ‘పుష్ప: ది రూల్‌’లోనూ కొన్ని గ్యాంగ్‌ వార్‌ సన్నివేశాలు ఉంటాయనుకోవచ్చు. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

కాగా సీనియర్‌ యాక్టర్‌ రాజశేఖర్‌ సైతం ఈ వెండితెర గ్యాంగ్‌వార్‌లో భాగమయ్యారు. పవన్‌ సాధినేని దర్శకత్వంలో రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘మాన్‌స్టర్‌’ గ్యాంగ్‌స్టర్‌ బ్యాక్‌డ్రాప్‌ ఫిల్మ్‌. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

అలాగే యువ హీరో సందీప్‌ కిషన్‌ టైటిల్‌ రోల్‌లో, విజయ్‌ సేతుపతి ఓ లీడ్‌ రోల్‌లో నటించిన ‘మైఖేల్‌’ కూడా గ్యాంగ్‌స్టర్‌ డ్రామానే.

ఇంకోవైపు ‘మాస్టర్‌’ చిత్రం తర్వాత తమిళ ప్రముఖ హీరో విజయ్, దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో తాజాగా మరో సినిమా రూపొందనుంది. ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌వార్‌గా ఈ సినిమా ఉంటుందనే టాక్‌ ఆల్రెడీ కోలీవుడ్‌లో మొదలైంది. ఈ సినిమాలో సంజయ్‌ దత్, ఫాహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు చేయనున్నారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు లోకేష్‌ అండ్‌ కో.

అదే విధంగా ఈ సినిమా తర్వాత కార్తీతో ‘ఖైదీ’కి సీక్వెల్‌గా ‘ఖైదీ 2’ తీయనున్నారు లోకేష్‌. డ్రగ్స్‌ మాఫియా నేపథ్యంలో సాగిన ‘ఖైదీ’ సినిమాకు సీక్వెల్‌గా రానున్న ‘ఖైదీ 2’ గ్యాంగ్‌వార్‌ ఫిల్మ్‌ అట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

అటు కన్నడంలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కబ్జా’. ఆర్‌. చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 1960–1984 బ్యాక్‌డ్రాప్‌లోని గ్యాంగ్‌స్టర్‌ ఫిల్మ్‌ అని తెలుస్తోంది.

కాగా, ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన దుల్కర్‌ సల్మాన్‌ చేస్తున్న మలయాళ చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కోతా’. పీరియాడికల్‌ గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు అభిషేక్‌ జోషి దర్శకుడు. దుల్కర్‌ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్‌ కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాలు గ్యాంగ్‌వార్‌ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించనున్నాయి.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top