● మామిడితోరణాలు, బెలూన్లు, రంగు కాగితాలతో స్కూళ్ల అలంకరణ ● స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ, పూలు అందజేత ● నోట్, పాఠ్య పుస్తకాలు పంపిణీ
మంచిర్యాలఅర్బన్: వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలల్లో సోమవారం బడి గంట మోగింది. స్కూళ్లకు వచ్చిన విద్యార్థుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. విద్యాసంవత్సరం ప్రారంభమైన వేళ అమావాస్య ప్రభావం కొన్ని చోట్ల విద్యార్థుల హాజరుపై పడింది. జిల్లాలో ఉపాధ్యాయులు పాఠశాలలను మామిడి తోరణాలు, రంగుల కాగితాలు, పూల దండలు, బెలూన్లతో అలంకరించి ఆహ్లాదకర వాతావరణం కల్పించారు. టీచర్ల రాక కోసం ఎదురు చూశారు. పాఠశాలల ప్రాంగణంలో చిన్నారులకు స్వాగతం పలుకుతూ రంగుల బెలూన్లూ, పెన్సిల్, స్వీట్లు పంపిణీ చేశారు. పలు చోట్ల ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా నోట్, పాఠ్య పుస్తకాలు అందజేశారు. తొలి రోజు విద్యార్థుల హాజరు నామమాత్రంగా నమోదైంది. మధ్యాహ్నం 3.30గంటల వరకు యూడైస్ వివరాల ప్రకారం జిల్లాలోని 767 పాఠశాలల్లో 34,192 మందికి గాను 4,369 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ లెక్కన 13.58శాతం హాజరు నమోదైంది. ఉదయం నుంచి యాప్‌లో సాంకేతిక లోపం వల్ల మధ్యాహ్నం వరకు హాజరుకు కొంతమేర ఆటంకం ఏర్పడింది. కొన్ని చోట్ల విద్యార్థుల హాజరు తీసుకోకపోవడంతో తగ్గినట్లు చెబుతున్నారు. అమావాస్య కారణంగా తల్లిదండ్రులు పిల్లలను పంపించడంలో ఆసక్తి చూపకపోవడం కూడా హాజరు తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. మరోవైపు కొన్ని ప్రైవేటు పాఠశాలలు తెరవకపోవడం గమనార్హం. ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యార్థులు బడిబాట పట్టే అవకాశాలున్నాయి.
భీమారంలో వినూత్నంగా ఫ్రేమ్
భీమారం: మండలంలోని ఆర్కెపల్లి పాఠశాలలో విద్యార్థులకు వినూత్నంగా స్వాగతం పలికారు. ఫ్రేమ్ చేయించి విద్యార్థులను ఫొటో తీశారు. దాంపూర్‌లో పాఠశాలను సర్పంచ్ కొమురయ్య విద్యార్థులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.


