సింగరేణిలో కార్మికుల వెట్టిచాకిరీ | - | Sakshi
Sakshi News home page

సింగరేణిలో కార్మికుల వెట్టిచాకిరీ

Jun 16 2026 12:22 AM | Updated on Jun 16 2026 12:22 AM

వసతులు కల్పించని యాజమాన్యం

కర్కోటక కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాటం

కార్మికులను మభ్యపెడుతున్న సీఎం, డిప్యూటీ సీఎం

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

పాతమంచిర్యాల/కాసిపేట/బెల్లంపల్లి: సింగరేణి కార్మికులతో యాజమాన్యం వెట్టిచాకిరీ చేయించుకుంటోందని, కనీస వసతులు కల్పించకుండా ఎక్కువ గంటలు పని చేయిస్తూ పెత్తనం చెలాయిస్తోందని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్‌) రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట కవిత విమర్శించారు. సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లాలో పర్యటించారు. మంచిర్యాలలోని ఎం కన్వెన్షన్‌ హాల్‌లో సమావేశంలో మాట్లాడారు. బెల్లంపల్లిలోని తిలక్‌ స్టేడియం ఎదుట పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాసిపేట గనిపై కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో కవిత మాట్లాడుతూ సింగరేణిలో పని ముట్ల కొరత తీవ్రంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్‌కోడ్‌లను అమలు చేయబోమని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి సంస్థలో కార్మికుల అలియాస్‌ పేర్ల సమస్య పరిష్కరించాలని, డిపెండెంట్‌ ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. సంస్థలో బొగ్గు మాయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కర్కోటక కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాటానికి సమయం ఆస్నమైందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని విమర్శించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే రెండు నెలలకోసారి కూడా ప్రజలకు దర్శనం ఇవ్వడం లేదని, ఇక్కడి రోడ్లు అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం సింగరేణి కార్మికులను మభ్యపెడుతున్నారని, బొగ్గు బావులు తేవాల్సిన వారు వినతిపత్రాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమాల్లో హెచ్‌ఎంస్‌ స్టేట్‌ జనరల్‌ సెక్రెటరీ రియాజ్‌ అహ్మద్‌, మాజీ మంత్రి బోడ జనార్ధన్‌, నాయకులు ఉదారి చంద్రమోహన్‌గౌడ్‌, సాజన్‌, వెంకట్‌, నాయకులు సురేష్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

విద్య, వైద్యం ఉచితం

లక్సెట్టిపేట: టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవిత అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌక్‌ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యం అమ్ముకునేందుకు చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement