మంచిర్యాలఅర్బన్: వేసవి సెలవులు ముగియడంతో సోమవారం పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. సెలవులకు స్వస్తి చెప్పి విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో పరిశుభ్రత పనులపై యాజమాన్యాలు దృష్టి సారించాయి. తరగతి గదులు, ప్రాంగణాలను శుభ్రం చేయించారు. తాగునీరు, మరుగుదొడ్లు, భద్రతా ఏర్పాట్లను సరి చూసి అవసరమైన సదుపాయాలు కల్పించారు. మామిడి తోరణాలు, రంగుల కాగి తాలు, బెలూన్లతో సర్కారు పాఠశాలలను అలంకరించి విద్యార్థులకు స్వాగతం పలుకనున్నారు.
తొలిరోజు పుస్తకాల పంపిణీ
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 1,051 ఉండగా 1,32,353 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 234 ప్రైవేట్ పాఠశాలల్లో 70,273 మంది విద్యార్థులు చదువుతున్నారు. 817 కేజీబీవీ, మోడల్‌స్కూల్, రెసిడెన్షియల్, ప్రభుత్వ పాఠశాలల్లో 62,080 మంది, డీఈవో పరిధిలో 709 పాఠశాలల్లో 43,072 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలు మినహాయిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు అందజేయాల్సి ఉంది. ఇప్పటికే 3,05,620 నోట్, పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు చేరాయి. పాఠశాలల పున:ప్రారంభం రోజునే విద్యార్థి చేతికి పాఠ్యపుస్తకం అందించనుండగా యూనిఫామ్‌లు మాత్రం ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. యూనిఫామ్ కలర్ మార్చడంతో సాధారణ దుస్తులతోనే బడికి వెళ్లాల్సిన పరిస్థితి. పాత దుస్తులు చిరిగిపోవడంతో కొత్తవి కావాలని చిన్నారులు మారాం చేస్తుంటారు. దీంతో తల్లిదండ్రులు కొత్త దుస్తుల కొనుగోలుపై దృష్టి సారించాల్సి వస్తుంది. ఈఏడాది ‘బడి బాట’ తర్వాత అడ్మిషన్లు పెరిగే పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై దృష్టి సారిస్తున్నామని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది 72 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య అమలుకానుంది. ఇప్పటికే ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను నియమించే ప్రక్రియ పూర్తి చేశారు.
బడి శుభ్రత.. భోజనంలో నాణ్యత
సర్కారు పాఠశాలల్లో బడి శుభ్రత, భోజనంలో నాణ్యతపై ప్రభుత్వం దృష్టి సారించింది. వంట శుభ్రత, వడ్డన అంశాలపై 1,290 మంది మధ్యాహ్న భోజన కార్మికులు, ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఇదివరకే వంట తయారీకి నాణ్యమైన సామగ్రి కొనుగోలు చేశారు. సెలవుల అనంతరం పాఠశాలలు తెరుచుకోనుండటంతో మధ్యాహ్న భోజనానికి అవసరమైన బియ్యం పాఠశాలలకు చేరింది. వంట కార్మికులు వంటపాత్రలు శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు తప్పనిసరిగా మధ్యాహ్న భోజనం అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అల్పాహారం అందించేందుకు కొన్ని పాఠశాలలనే పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. దీంతో తొలి విడతలో జిల్లాలో సర్కారు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అల్పాహారం లేనట్లే.
గతేడాది పదో తరగతి పరీక్షలకు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 9,703 మంది హాజరయ్యారు. ఇందులో సర్కారు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు 5,499 మంది కాగా తెలుగు మీడియంలో 769 మంది పరీక్షలకు హాజరయ్యారు.
ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమంతో సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి బడిబాట కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 9,376 మంది విద్యార్థులు సర్కారు పాఠశాలల్లో చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ఒకటి నుంచి పదోతరగతి వరకు 6,909 చేరికలు నమోదయ్యాయి. టీజీఎంఎస్, కేజీబీవీ, యూఆర్‌ఎస్, టీజీఆర్‌ఈఐఎస్ పాఠశాలల్లో రెండో తరగతి నుంచి 12వ తరగతి వరకు 2,467 మంది ప్రవేశాలు పొందారు. మంచిర్యాలలో 1,121, లక్సెట్టిపేటలో 1,033, బెల్లంపల్లిలో 715, జన్నారంలో 671 మంది విద్యార్థులు చేరారు.
పుస్తకాల ధరలు, ఫీజుల భారంతో ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల మార్పిడి గణనీయంగా పెరిగింది. గతేడాది జూలై 18 నాటికి రెండోతరగతి నుంచి పదోతరగతి వరకు 1,609 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. టీజీఎంఎస్, కేజీబీవీ, యూఆర్‌ఎస్, టీజీఆర్‌ఈఐఎస్‌లో 835 మంది చేరారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం, మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన బోధనతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.


