మంచిర్యాల అభివృద్ధి రాష్ట్రానికే మోడల్‌ | - | Sakshi
Sakshi News home page

మంచిర్యాల అభివృద్ధి రాష్ట్రానికే మోడల్‌

Jun 15 2026 4:10 AM | Updated on Jun 15 2026 4:10 AM

● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాలలో జరుగుతున్న అభివృద్ధి రాష్ట్రానికే ఒక మోడల్‌ అవుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు నివాసంలో ఆదివారం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మేయర్‌ దర్ని మధుకర్‌తో కలిసి మాట్లాడారు. మంచిర్యాల పట్టణ ప్రగతిపై ప్రశంసలు కురిపిస్తూనే స్థానిక ఎమ్మెల్యే సంకల్పం, నిబద్ధత వల్లే అద్భుతమైన అభివృద్ధి సాధ్యమైందని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా మంచిర్యాల మోడల్‌ను అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులను, కమిషనర్లను ఇక్కడికి పంపించి, ఈ అభివృద్ధిని ఒక మోడల్‌గా చూసి స్ఫూర్తి పొందేలా చేయాలని మంత్రి శ్రీధర్‌బాబుతో చర్చించానన్నారు. ఇక్కడి 50 పడకల ఆస్పత్రి, ఆర్కిటెక్చర్‌, విశాలమైన వరండాలు, గాలి వెలుతురు వచ్చేలా కట్టిన విధానం నచ్చి, పరిశీలనకు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్టుమెంట్‌ వారిని ఇక్కడికి పంపించామన్నారు. ఇక్కడి మాదిరి తన నియోజకవర్గంలోనూ 50 పడకల ఆస్పత్రిని సాంక్షన్‌ చేయించుకున్నామన్నారు. 50 ఏళ్ల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేస్తున్నారని, దూరదృష్టితో పునాదులు వేసేవాడే నిజమైన నాయకుడన్నారు. అలాంటి నాయకత్వం, ప్రజల మద్దతు ఉండడం వల్లే అన్ని రంగాల్లోనూ మంచిర్యాల దూసుకుపోతుందన్నారు. మంచిర్యాల నియోజకవర్గానికి అనేక దశాబ్దాలుగా సరైన ఎమ్మెల్యే దొరకలేదని, ఇప్పుడు ఆ లోటు ఈ ప్రాంత ప్రజలకు తీరిందన్నారు. తమ నియోజకవర్గానికి ఇండస్ట్రియల్‌ పార్కు మంజూరు చేయాలని మంత్రి శ్రీధర్‌బాబును అడిగి రెండున్నరేళ్లు అవుతున్నా ఇప్పటికీ మంజూరు చేయలేదని, కానీ మంచిర్యాలకు మాత్రం మంజూరు చేయగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఎవరూ తీసుకోని విధంగా ఒక ఫిష్‌పాండ్‌ (చేపల చెరువు) కూడా ఇక్కడికి తెచ్చుకున్నాన్నారు. తాను ఉమ్మడి జిల్లాలో సీఎల్పీ లీడర్‌గా ఆదిలాబాద్‌ నుంచి పాతయాత్ర చేపట్టిన సమయంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఎవరికీ లేని సమయంలో ప్రేమ్‌సాగర్‌రావు, కొక్కిరాల సురేఖ, శ్రీధర్‌బాబు తన వెనకుండి ముందుకు నడిపించారన్నారు. రాబోయే రోజుల్లో సమస్యల పరిష్కారంలో మంచిర్యాల నియోజకవర్గానికి సింహభాగం ఉంటుందని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement