వైద్య సేవలకు కష్టమే? | - | Sakshi
Sakshi News home page

వైద్య సేవలకు కష్టమే?

Jun 15 2026 4:10 AM | Updated on Jun 15 2026 4:10 AM

శిథిలమైన భవనంలోనే మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి

ఆపరేషన్‌ థియేటర్లు లేక శస్త్ర చికిత్సలకు వెనుకడుగు

సూపరింటెండెంట్‌తో పాటు రేడియాలజిస్టుల బదిలీతో ఇబ్బందులు

మంచిర్యాలటౌన్‌: జిల్లా ప్రజలకు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ద్వారా అందే వైద్యసేవలకు ఈ ఏడాది కూడా కష్టంగానే మారనుంది. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద శిథిలావస్థకు చేరుకున్న భవనంలోనే ప్రస్తుతం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కాలేజ్‌రోడ్డులో మూడేళ్ల క్రితంరూ. 129.25 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి, రూ.23.75 కోట్లతో క్రిటికల్‌ కేర్‌ విభాగం భవన నిర్మాణాలు ప్రారంభించారు. నిర్మాణంలో జరుగుతున్న ఆలస్య ంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పనులు నత్తనడకన సాగుతుండడంతో భవన నిర్మాణం పూర్తి చేయించడంలో అధికారులు విఫలం చెందుతున్నారు. పదిరోజులకోసారి కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశిస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరించడంతోనే, భవన నిర్మాణం పూర్తికా వడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

వర్షాలు కురిస్తే ఇక అంతే

మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో భయం భయంగానే రోగులకు వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి భవనంలోని గదులు సరిపోక ఇబ్బందులు పడుతుంటే, శిథిలావస్థకు చేరిన భవనంలో స్లాబ్‌ పెచ్చులూడుతుండగానే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదే భవనంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్‌బ్యాంక్‌ను నిర్వహిస్తూ, తలసేమియా, సికిల్‌సెల్‌ రోగులకు ప్రతిరోజు రక్తమార్పిడి చేస్తున్నారు. ఓపీ సేవలతో పాటు, ల్యాబ్‌, ఎక్స్‌రే, సిటిస్కాన్‌, మందుల పంపిణీ, డ్రగ్‌ స్టోర్‌ అందులోనే నిర్వహిస్తున్నారు. ఏటా వర్షాకాలంలో ఈ భవనంలోని స్లాబ్‌ నుంచి ఏదో ఒక గదిలో పెచ్చులూడుతుండడం ఆందోళన కలిగిస్తుండగా, ఈ ఏడాది జనవరిలో మూత్రశాలలోని స్లాబ్‌ పెచ్చులు ఒక్కసారిగా ఊడి కింద పడిపోయి రోగి సహాయకురాలికి గాయాలయ్యాయి. డయాలసిస్‌ నిర్వహిస్తున్న భవనం స్లాబ్‌ సైతం పెచ్చులూడుతుండడంతో కిడ్నీ బాధితులకు రక్తం శుద్ధి చేయడం ఇబ్బందిగా మారుతోంది. స్లాబ్‌ పెచ్చులు కిందపడకుండా అడ్డుగా ఏదో ఒకటి పెడుతూ నెట్టుకొస్తున్నారు. గోదావరి ఒడ్డున నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్‌) సైతం వర్షాకాలం వస్తే వరదలో మునిగి పోతుంది. దీంతో ఎంసీహెచ్‌ను ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న జనరల్‌ ఆసుపత్రి భవనంలో గర్భిణులు, బాలింతలు సైతం బిక్కుబిక్కుమంటూ చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి. వర్షాకాలం రాకముందే కొత్త భవనం అందుబాటులోకి వచ్చి ఉంటే, రోగులకు ఇబ్బందులు తప్పేవి. ఈ వర్షాకాలంలో ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, మాతా శిశు ఆరోగ్య కేంద్రం రోగులకు వైద్య సేవలు కష్టమే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement