మునీర్‌ స్మారక భవన నిర్మాణానికి కృషి | - | Sakshi
Sakshi News home page

మునీర్‌ స్మారక భవన నిర్మాణానికి కృషి

Jun 15 2026 4:10 AM | Updated on Jun 15 2026 4:10 AM

● మంత్రి వివేక్‌ వెంకటస్వామి

మందమర్రిరూరల్‌: మందమర్రిలో సీనియర్‌ జర్నలిస్టు మునీర్‌ స్మారక భవన నిర్మాణానికి కృషి చేస్తానని కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. ఆదివారం పట్టణంలోని సీఈఆర్‌ క్లబ్‌లో జర్నలిస్ట్‌ చందర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం, పూర్వ సంపాదకులు రామచంద్రమూర్తి, సీనియర్‌ జర్నలిస్ట్‌ మల్లేపల్లి లక్ష్మయ్యతో కలిసి మునీర్‌ భాయ్‌ (ప్లొటేరియన్‌ జర్నలిస్ట్‌) పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మునీర్‌ చిన్న వయసులోనే పెత్తందారీ విధానంపై పోరాటం చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడన్నారు. జర్నలిస్ట్‌గా నలబై యేళ్లపాటు ప్రజా, కార్మిక సమస్యలపై అనేక వ్యాసాలు, కథనాలు రాసాడన్నారు. కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి ముందుకు నడిపించాడన్నారు. నేటి జర్నలిస్ట్‌లు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వక్తలు మునీర్‌తో పంచుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అంతకు ముందు మునీర్‌ చిత్రపటానికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జనంసాక్షి ఎడిటర్‌ రహమాన్‌, ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య, టీజీబీకేఎస్‌ వ్యవస్థాపకులు కెంగర్ల మల్లయ్య, పుస్తక రచయితలు మాదాసి రామమూర్తి, నక్క వెంకట్రావ్‌, తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి

మంచిర్యాలటౌన్‌: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆదివారం మంచిర్యాలలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో యువకులతో కలిసి క్రికెట్‌ ఆడారు. యోగా, ఫిట్‌నెస్‌ సభ్యులతో కలిసి వ్యాయామం చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానం అభివృద్ధికి 20 ట్రిప్పుల మట్టి పోయాల ని శ్రీరాంపూర్‌ జీఎం శ్రీనివాస్‌కు ఫోనులో సూచించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు రెండు క్రికెట్‌ కిట్లు అందించడం జరుగుతుందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement