మంచిర్యాలరూరల్(హాజీపూర్): విద్యా సంస్థలు ప్రారంభం కానుండడంతో రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. డీటీవో గోపీకృష్ణ ఆధ్వర్యంలో ఎంవీఐలు, ఏఎంవీఐలు 15 రోజులుగా బస్సుల ఫిట్‌నెస్ పరీక్షల్లో నిమగ్నమై ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రైవేటు విద్యాసంస్థల్లో 375 బస్సులు ఉన్నాయి. అందులో 303 బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించగా 17 వాహనాలు ఫిట్‌గా లేవని వాటిని రిజెక్ట్ చేశారు. మిగిలిన 55 బస్సులు ఇంకా ఫిట్‌నెస్ పరీక్షలకు రాలేదు. రూ.వేల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బస్సుల నిర్వహణను మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. పాఠశాలల్లో పేరెంట్ కమిటీలు ఉంటే బస్సు ఫిట్‌నెస్, ప్రమాదాల విషయంలో ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కానీ ఏక్కడా కూడా ఈ కమిటీల ఏర్పాటు జరగడం లేదు. ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాలని, లేనిపక్షంలో తనిఖీల్లో పట్టుబడితే సీజ్ చేస్తామని డీటీవో హెచ్చరించినా యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం గమనార్హం.
అటెండర్ ఉండాలి
ప్రతీ స్కూల్ బస్సుకు విధిగా అటెండర్ ఉండాలి. బస్సు రివర్స్ తీసుకునే సమయంలోనే కాదు.. పిల్లలను ఎక్కించడం, దించడంతో పాటు రోడ్లు దాటించే సమయంలో వీరి పాత్ర కీలకంగా ఉంటుంది. బస్సులో సీసీ కెమెరాలు, జీపీఎస్, అత్యవసర ద్వారం, ఫస్ట్ ఎయిడ్ కిట్, అగ్నిమాపక యంత్రాలతో పాటు ఐదేళ్ల అనుభవం కలిగిన డ్రైవర్ నియామకం ఇలా అన్నీ మార్గదర్శకాల మేరకు ఉండాలి. కానీ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. రవాణా, విద్య, పోలీస్ శాఖలు టాస్క్‌ఫోర్స్‌గా ప్రతీ మూడు నెలలకోసారి తనిఖీలు జరుపుతూ కఠినంగా వ్యవహరిస్తే భద్రతతో పాటు ప్రమాదాల నివారణలో భాగస్వామ్యం అవుతారు.
25 వరకు స్పెషల్ డ్రైవ్..
విద్యా సంవత్సరం ప్రా రంభం రోజు నుంచి 25వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఉ దయం, సాయంత్రం వేళల్లో తనిఖీలు ఉంటాయి. బస్సుల ఫిట్‌నెస్‌తో పాటు విద్యార్థులను పరి మితికి మించి ఎక్కించడం, ప్రథమ చికిత్స, అగ్నిమాపక నివారణ యంత్రాల ఏర్పా టు వంటి వాటి విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. పాఠశాల యాజమాన్యాలు ఎలాంటి నిర్లక్ష్యం చేసినా చట్టపరమైన చర్యలు తప్పవు.
– వెల్ది గోపీకృష్ణ, డీటీవో, మంచిర్యాల


