ఇంద్రవెల్లి: గుండెపోటుతో బాలింత మృతి చెందిన ఘటన మండలంలోని మల్లాపూర్ పంచాయతీ పరిధి బోరుజ్‌గూడలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మరప ప్రమీల(28), గణపతి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రమీల మొదటి కాన్పులో జన్మించిన మగబిడ్డ నాలుగు నెలలకే అనారోగ్యంతో మృతిచెందాడు. చాలా రోజుల తర్వాత ప్రెగ్నంట్ అయింది. శనివారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు అంబులెన్స్‌లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ప్రసవం అనంతరం మగబిడ్డకు జన్మనివ్వగా, రెండు గంటలకు బిడ్డకు పాలు పట్టించింది. రాత్రి సమయంలో ప్రమీలకు ఒక్కసారిగా గుండెపోటు రాగా, చికిత్సపొందుతూ మృతి చెందింది. తల్లి మృతితో బిడ్డను చూసేదెవరని కుటుంబీకులు, గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు. బిడ్డ సంరక్షణ కోసం దాతలు ముందుకొచ్చి మరప గణపతికి ఆర్థికసాయం చేయాలని కోరుతున్నారు.
పార్‌పెల్లితండాలో యువకుడు..
లక్ష్మణచాంద: మండలంలోని పార్‌పెల్లి అనుబంధ గ్రామం పార్‌పెల్లి తండాకు చెందిన గుగ్లవత్ నవీన్ గుండెపోటుతో మృతిచెందాడు. ధర్‌సింగ్–జమున దంపతులకు ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు గుగ్లవత్ నవీన్(22) జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం పనులు ముగించుకుని ఇంటికి చేరుకుని నిద్రించాడు. అర్థరాత్రి సమయంలో ఛాతీ నొప్పి వస్తుందని తల్లిదండ్రులకు తెలిపాడు. గతంలోని ఉపయోగించిన టాబ్లెట్స్ వేశారు. కొంత సమయం తర్వాత మళ్లీ నొప్పిరావడంతో నిద్రలో మృతిచెందాడు. కుమారుడి మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
చార్జింగ్ పెట్టిన సెల్‌ఫోన్ తీస్తుండగా వివాహిత..
వాంకిడి: చార్జింగ్ పెట్టిన సెల్‌ఫోన్ తీస్తుండగా విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి చెందింది. మండలంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం..తేజిగూడ గ్రామానికి చెందిన మొహర్లె రమేశ్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె మహేశ్వరి(20)ని మూడు నెలల క్రితం లక్ష్మిపూర్‌కు చెందిన నగోసే వేణుతో వివాహం చేశారు. కాగా, శనివారం సాయంత్రం మహేశ్వరి తన ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టింది. ఈ క్రమంలో చార్జింగ్ వైర్‌ను తొలగిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై కిందపడింది. గమనించిన అత్త కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు. కుటుంబీకులు ఆమెను వాంకిడి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


