రిసార్ట్‌లో అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

రిసార్ట్‌లో అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి

Jun 15 2026 4:10 AM | Updated on Jun 15 2026 4:10 AM

ఒంటిపై గాయాలు.. హత్య చేశారని తండ్రి ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు చౌటుప్పల్‌ మండలం ఎల్లంబావి శివారులో ఘటన

నస్పూర్‌/చౌటుప్పల్‌: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ఎల్లంబావి శివారు ఓ రిసార్ట్‌లో శనివారం అర్ధరాత్రి యువకుడు అనుమానా స్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని విలేజ్‌ శ్రీరాంపూర్‌కు చెందిన గాండ్ల రాము(27) హైదరాబాద్‌ ఉప్పల్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. కూకట్‌పల్లిలో ఉంటున్నాడు. వీకెండ్‌ కావడంతో కంపెనీకి చెందిన 20 మంది స్నేహితులు కలిసి పార్టీ చేసుకునేందుకు ఎల్లంబావి శివారులోని ఓ రిసార్ట్‌ను బుక్‌ చేసుకున్నారు.

స్నేహితుల మధ్య ఘర్షణ

రాము, అతని స్నేహితులు శనివారం సాయంత్రం రిసార్ట్‌కు చేరుకున్నారు. అందరూ కలిసి మద్యం తాగారు. అర్ధరాత్రి సమయంలో స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో గొడవ జరిగింది. కొంతసేపటి తర్వాత సద్దుమణిగింది. అర్ధరాత్రి తర్వాత నలుగురు స్నేహితులు కలిసి రిసార్ట్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొట్టేందుకు వెళ్లారు. అందులో ఒక వ్యక్తికి ఈత రాకపోవడంతో స్విమ్మింగ్‌ పూల్‌లో నడుచుకుంటూ మిగతావారిని అనుసరించసాగాడు. ఈ క్రమంలో అతని కాళ్లకు నీటి అడుగున ఏదో తగిలింది. ఈ విషయాన్ని మిగిలిన ముగ్గురు మిత్రులకు చెప్పడంతో వారు స్విమ్మింగ్‌ పూల్‌ లోపలికి వెళ్లి చూడగా.. రాము కనిపించగా బయటకు తీసుకువచ్చారు. మిగతా స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో వారు బయటకు వచ్చి రాముకు సీపీఆర్‌ చేశారు. వెంటనే చౌటుప్పల్‌ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చౌటుప్పల్‌ సీఐ మన్మథకుమార్‌, ఎస్సై యాదగిరి ఘటనస్థలానికి వెళ్లి పరిశీలించి ఆధారాలు సేకరించారు. తన కుమారుడి ఒంటిపై గాయాలు ఉన్నాయని, స్నేహితులే కొట్టి హత్య చేశారని తండ్రి అంజయ్య ఫిర్యాదు చేశారు. ఈమేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement