జ్యువెలరీ షాపులో చోరీ
తానూరు: మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఉన్న తుల్జా భవాని జ్యువెలరీ షాపులో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. అంతర్రాష్ట్ర ముఠా ఇద్దరు దొంగలు మహిళ వేషధారణలో చీరలు కట్టుకుని షాప్ వద్దకు వచ్చారు. షటర్ ధ్వంసం చేసి షాపులో చొరబడి మూడు తులాల వెండి ఆభరణాలు, 15 గ్రాముల మూడు నాణెలు ఎత్తుకెళ్లారు. రాత్రి అటు నుంచి వస్తున్న ఇద్దరిని గమనించి దొంగలు.. విఠలేశ్వర ఆలయం వైపు పరుగులు తీయగా వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై షేక్ జుబేర్ సిబ్బందితో కలిసి ఆలయం వైపు వెళ్లారు. ఒక ఇంటి ఆవరణలో దాక్కున్న దొంగలు పోలీసులను చూసి గేటు పైనుంచి దాటే క్రమంలో చీర తట్టుకుంది. చీరను అక్కడే వదిలేసి అక్కడే ఉన్న బైక్‌ను దొంగలించి జౌలా(బి) మార్గంలో వెళ్లారు. పోలీసులు వెంబడించడంతో జౌలా(బి) శివారులో బైక్ వదిలేసి చేలకు పరుగులు తీశారు. వెంబడించి ఒకరిని పట్టుకోగా మరొకరు పరారైనట్లు ఎస్సై వెల్లడించారు. పట్టుకున్న దొంగ మహారాష్ట్రలోని స్టేషన్ ఉమ్రి గ్రామానికి చెందిన సయ్యద్ సోయల్‌గా గుర్తించారు. అతని నుంచి మూడు తులాల వెండి ఆభరణాలు. 15 గ్రాముల వెండి నాణేలు రికవరీ చేసినట్లు తెలిపారు. మరో దొంగ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ముధోల్ సీఐ రవీందర్ నాయక్ చేరుకుని జ్యువెలరీ షాపును పరిశీలించారు. ఫింగర్ ప్రింట్ తనిఖీ బృందంతో ఆధారాలు సేకరించాయి. పూర్తి విచారణ తర్వాతే వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు.


