బోథ్: వాహన నంబర్లు, ఛాసిస్, ఇంజిన్ నంబర్లను ఫోర్జరీ చేసి తెలంగాణలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడానికి యత్నిస్తున్న ముగ్గురిని బోథ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బోథ్ పోలీస్‌స్టేషన్‌లో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. సొనాల మండల కేంద్రానికి చెందిన డ్రైవర్ ఎస్.కె.నయీమ్ (37) మహారాష్ట్ర లాతూర్ ప్రాంతంలో మహీంద్రా మ్యాక్స్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. సరైన పత్రాలు లేకపోవడంతో, తెలంగాణలో రిజిస్ట్రేషన్ కోసం అడ్డదారిని ఎంచుకున్నాడు. స్క్రాప్‌నకు వెళ్లిన ఏపీ23జె1036 అనే పాత వాహనానికి సంబంధించిన పత్రాలను పెందూర్ ఇంద్రు నుంచి రూ. 10 వేలకు కొనుగోలు చేశాడు. మాకునూర్ విజయ్ కుమార్ సహాయంతో మహారాష్ట్ర వాహనంపై ఉన్న ఛాసిస్, ఇంజిన్ నంబర్లు తొలగించి, ఫోర్జరీ వెల్డింగ్ పనుల ద్వారా పాత వాహన నంబర్లు చెక్కించారు. శనివారం ఉదయం బోథ్ కోరమాండల్ జంక్షన్ వద్ద ఎస్సై పురుషోత్తం సిబ్బందితో కలిసి వాహన తనిఖీ నిర్వహించారు. మహీంద్రా మ్యాక్స్ వాహనంతో వస్తున్న నయీమ్ పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించాడు. సిబ్బంది వాహనాన్ని వెంబడించి ఆపి నయీమ్‌ను విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్.కె. నయీమ్, మాకునూర్ విజయ్‌కుమార్, పెందూర్ ఇంద్రుపై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ డి.గురుస్వామి, ఎస్సైవి.పురుషోత్తం, హెడ్ కానిస్టేబుల్ మదన్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.


