మంచిర్యాలటౌన్: బీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయని, సింగరేణి సంస్థను, కార్మికులను కాపాడుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం స్థానిక పద్మనాయక ఫంక్షన్‌హాల్‌లో సింగరేణి సంస్థలో 335 మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీప్యూటీ సీఎం మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు.
గూడెం ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం
దండేపల్లి: గూడెం ఆలయాన్ని మహా అద్భుతంగా తీర్చిదిద్దుతామని, విద్యాలయాలు, వైద్యశాలలు, దేవాలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రూ.58 కోట్ల గోదావరి పుష్కరాల నిధులతో దండేపల్లి మండలం గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయ పునః నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు మక్కాన్‌సింగ్‌ఠాకూర్, సత్యనారాయణతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ‘భట్టి’ మాట్లాడారు. పిప్రిలో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు గూడెం ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డితో ప్రస్తావించడంతో స్పందించి 37 రోజుల్లోనే నిధులు మంజూరు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ప్రత్యేక నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే దేవాలయాల అభివృద్ధికి రూ.2,216 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఆలయాలు, సాగునీటి రంగాల అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు బహుముఖ వ్యూహంతో ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నారని అభినందించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్‌దీపక్, దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, అదనపు కలెక్టర్లు రాములు, చంద్రయ్య, డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్, మంచిర్యాల మేయర్ మధుకర్, డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, డీఆర్‌డీవో కిషన్, తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, తదితరులు పాల్గొన్నారు.
శంకుస్థాపనలు ఇవే...
గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయ పునః నిర్మాణం, అభివృద్ధి పనులతోపాటు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రూ.9.70 కోట్లతో గ్రామ సంఘ భవనాల నిర్మాణం, లక్సెట్టిపేట మున్సిపల్ పరిధిలో రూ.2.30 కోట్లతో సీసీ రోడ్డు పనులు, రూ.2 కోట్లతో డ్రెయినేజీల నిర్మాణం, లక్సెట్టిపేట, దండేపల్లి మండలాల్లోని మోదెల, ద్వారక, గుడిరేవు గ్రామాల సమీపంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎడమవైపున రూ.74.40 కోట్ల నిధులతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఘనస్వాగతం..
గూడెం సత్యనారాయణస్వామి ఆలయానికి విచ్చేసిన డిప్యూటీ మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లకు ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు, కలెక్టర్ కుమార్‌దీపక్ ఘనస్వాగతం పలికారు. గూడెం గుట్టపై సత్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. అర్చకులు ఆశీర్వచనం చేసి ప్రసాదం అందించారు.


