దహెగాం: మండలంలోని గెర్రె గ్రామంలో ఎనిమిది నెలల క్రితం జరిగిన నిండు గర్భిణి హత్యకేసులో ఏ 4గా నిందితుడిగా ఉన్న భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై చుంచు రమేశ్ కథనం ప్రకారం.. నిండు గర్భిణి తలాండి శ్రావణిని మామ శివార్ల సత్తయ్య అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. హత్య కేసులో ఏ4 గా ఉన్న భర్త శివార్ల శేఖర్(26) జైలు నుంచి విడుదలై బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో మేనకోడలి ఇంట్లో ఉంటున్నాడు. మూడురోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. శనివారం ఇంట్లో నుంచి బైక్‌పై వెళ్లగా తండ్రి సత్తయ్య ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. కుటుంబసభ్యులు వెతుకుతుండగా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో బైక్ కనిపించింది. అనుమానంతో వెతకగా చెట్టుకు ఉరేసుకున్నాడు. తన కుమారుడి మృతికి శ్రావణి తల్లిదండ్రులు చెన్నయ్య, అనసూర్యపై అనుమానం వ్యక్తం చేస్తూ సత్తయ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పెళ్లి కావడం లేదని యువకుడు..
భైంసారూరల్: పెళ్లి కావడం లేదని మనస్తాపం చెందిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సుప్రియ తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన ఉంగురాల రాజు (34)కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో రాజుకు వివాహం జరగకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. శనివారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబీకులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని భైంసా ఏరియాస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


