మంచిర్యాలటౌన్: మంచిర్యాల నియోజకవర్గంలోని గూడెం సత్యనారాయణస్వామి ఆలయం అభివృద్ధి, మంచిర్యాల విశ్వనాథ ఆలయం పునర్నిర్మాణ పనులకు రూ.70కోట్లు ఇస్తానని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి 36రోజుల్లోనే ఇవ్వడం, పనులకు శంకుస్థాపన చేసుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శనివారం ఆయా పనులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రారంభిస్తారని తెలి పారు. నియోజకవర్గంలో రూ.9.70కోట్లతో 35ఐకేపీ భవనాలు, నగరంలోని 60 డివిజన్లకు కార్యాలయాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. డివిజన్ కార్యాలయాల్లో ప్రజలు సమస్యలు తెలియజేస్తే వారం రోజుల్లోనే పరిష్కరించేలా పాలన సాగుతుందని అన్నారు. సింగరేణి ప్రాంత సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా పరిష్కారానికి హామీనిచ్చారని, మెడికల్ బోర్డు ఏర్పాటుతోపాటు ఇకపై మూడు నెలలకోసారి దరఖాస్తులను పరిష్కరిస్తుందని చెప్పారు. సింగరేణి వ్యాప్తంగా 335 మందికి కారుణ్య నియామక ఉద్యోగాలు ఇవ్వనుండగా.. శ్రీరాంపూర్ డివిజన్‌లోనే వందకు పైగా ఉన్నాయని, మంచిర్యాలలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా పత్రాలు అందజేస్తామని తెలిపారు. డీప్యూటీ సీఎం ‘భట్టి’ శ్రీరాంపూర్ సింగరేణి ఓసీని సందర్శిస్తారని, ఆదివారం వేంపల్లిలోని పద్మావతి గార్డెన్‌లో జరిగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై బూత్ స్థాయి ఏజెంట్ల అవగాహన శిక్షణ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, నగర మేయర్ దర్ని మధుకర్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


