నేటితో ముగియనున్న ‘ప్రగతి ప్రణాళిక’ సంక్షేమం, అభివృద్ధి పథకాలపై ప్రత్యేక దృష్టి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల యాక్షన్ ప్లాన్ శుక్రవారంతో ముగియనుంది. పది అంశాలతో మార్చి 6 నుంచి జూన్ 12వర కు సాగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై అవగాహన కల్పించడంతో పాటు లబ్ధిదారుల ఎంపిక తదితర వాటి పై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు పాల్గొంటూ వార్డు స్థాయి నుంచి మొదలు, గ్రామ, మండల, పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
ప్రభుత్వ పథకాలపై దృష్టి
రాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలుపై ప్ర త్యేక దృష్టి సారించింది. సభలు, సమావేశాల నిర్వహణతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించింది. ప్రజా ప్రతినిధులు, అధికారులతో ప్రజలను భాగస్వామ్యం చేయడంతో పథకాలపై విస్తృతంగా ప్రచారం చేశారు. 99రోజుల్లో పది అంశాలపై ఆయా శాఖల అధికారులు కార్యక్రమాలు నిర్వహించారు. పలు చోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులపై నిరసన వ్యక్తమైంది.
వారోత్సవాల నిర్వహణ
ఒక్కో అంశం వారోత్సవాలు నిర్వహించా రు. పచ్చదనం, పరిశుభ్రతలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో ఇంటింటా పచ్చదనం పెంచ డం, తడిపొడి చెత్త వేరు చేయడం, వ్యర్థాలను తిరిగి వాడేలా చేయడం, ప్లాస్టిక్ నిషేధం, మురికి కాలువలు, పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రజల్లో అవగాహన కల్పించారు.


