నిర్మల్‌రూరల్: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. మండలంలోని మేడిపల్లి శివారులో జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజాము ఈ ఘటన చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై లింబాద్రి కథనం ప్రకారం... ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలం గుట్టపక్క తండాకు చెందిన పవర్ జవహర్ సింగ్ (41) డ్రైవర్ లారీలో జొన్నల లోడ్‌తో సిరికొండ నుంచి సిద్దిపేటకు బుధవారం అర్ధరాత్రి బయల్దేరాడు. తెల్లవారుజామున మేడిపల్లి శివారు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ఒక్కసారిగా జవహర్‌సింగ్ నడుపుతున్న లారీకి మంటలు అంటుకున్నాయి. క్యాబిన్ పూర్తిగా కాలిపోయింది. అందులో చిక్కుకున్న జవహర్‌సింగ్ మంటల్లో కాలిపోయి మృతిచెందాడు. స్థానికులు గమనించి పోలీసు, ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పి క్యాబిన్‌లో జవహర్ సింగ్ మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రమాదానికి కారణమైన లారీ పాక్షికంగా కాలిపోయింది. లారీని నిర్లక్ష్యంగా రోడ్డుపై నిలిపి ఎలాంటి పార్కింగ్ లైట్లు వేయకుండా ప్రమాదానికి కారణమైన డ్రైవర్ చెంచు కోటేశ్వర్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


