బొగ్గు ఉత్పత్తి, ఓసీపీల నిర్వహణలో సింగరేణి ఆదర్శం డోర్లి–2 ఓసీపీ మూసివేత పనులపై కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ సంతృప్తి వడ్డీతో కలిపి రూ.40 కోట్ల ఎస్క్రో డిపాజిట్ చెల్లింపునకు ఆమోదం
రెబ్బెన: బొగ్గు ఉత్పత్తితో దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణలోనూ తన వంతు బాధ్యత నిర్వహిస్తోంది. ఓపెన్ కాస్టు ప్రాజెక్టుల ఏర్పాటుతో ధ్వంసమైన పచ్చదనాన్ని తిరిగి పెంపొందిస్తోంది. ఉత్పత్తి అనంతరం మూసివేసిన గనులపై విస్తృతంగా మొక్కలు పెంచుతూ పర్యావరణ పరిరక్షణ, భూ సంరక్షణ, పునరుద్ధరణకు పాటుపడుతోంది. ఈ క్రమంలో బొగ్గు గనుల నిర్వహణతోపాటు గనుల మూసివేత అనంతరం చేపట్టాల్సిన పర్యావరణ పరిరక్షణలో అత్యున్నత ప్రమాణాలు పాటించడంతో సింగరేణి సంస్థకు రూ.40 కోట్లు ఎస్క్రో డిపాజిట్ తిరిగి రానుంది. డోర్లి– 2 గని ప్రారంభ సమయంలో డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీతో కలిసి చెల్లించేందుకు కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఆమోదం తెలిపింది.
అడవిని తలపిస్తున్న ‘డోర్లి–2’
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని బెల్లంపల్లి ఏరియా డోర్లి– 2 ఓసీపీకి 2013– 14లో బొగ్గు తవ్వకాలకు అనుమతులు లభించాయి. ఆ సమయంలో గని నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, చర్యల కోసం అంచనా వ్యయం రూ.29.79 కోట్లను సింగరేణి యాజమాన్యం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ పేరుతో డిపాజిట్ చేసింది. ఏడేళ్లపాటు డోర్లి– 2లో బొగ్గు ఉత్పత్తిని చేపట్టి 2023–24లో మూసివేసింది. బొగ్గు ఉత్పత్తిని చేపట్టిన తర్వాత గనిని అలాగే వదిలేయకుండా కేంద్రం నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టింది. గని ప్రారంభ సమయంలో ఆ ప్రాంతంలో 162.517 హెక్టార్లలో అటవీప్రాంతం ఉండగా.. గని ఏర్పాటుతో కనుమరుగైంది. గని మూసివేసిన తర్వాత 162 హెక్టార్ల మేర మొక్కలు నాటి తిరిగి అడవిని మరిపించేలా పెంచింది. అలాగే 19.76 క్యూబిక్ మీటర్ల మేర భూమి పైపొర మట్టిని భద్రపర్చి దాన్ని డంపింగ్ యార్డులపై పర్చి మొక్కలు పెంచింది. గని మూసివేతకు సంబంధించి 2024 జూలైలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ప్రత్యేక అడిట్ నిర్వహించింది. అన్ని నిబంధనలను సింగరేణి అమలు చేసినట్లు నివేదించింది. డిప్యూటీ అసిస్టెంట్ కోల్ కంట్రోలర్ ఆకాశ్ శివహరే సింగరేణి జమ చేసిన ఎస్క్రో డిపాజిట్‌కు వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తున్నట్లు సింగరేణి యాజమాన్యానికి లేఖ రాశారు. చెల్లించాల్సిన మొత్తంలో 90 శాతం రూ.36.63 కోట్లను ప్రస్తుతం విడుదల చేస్తున్నట్లు, మిగిలిన 10 శాతం జస్ట్ ట్రాన్సిషన్ ప్రొవిజన్ అంశాల పరిశీలన అనంతరం విడుదల చేయనున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యానికి వడ్డీతో కలిపి దాదాపు రూ.40 కోట్లు అందనున్నాయి.
చేపట్టిన చర్యలివే..
బెల్లంపల్లి ఏరియాలోని డోర్లి–2 ఓసీపీ ఏర్పాటులో డోర్లి, దంతన్‌పల్లితోపాటు మరికొన్ని గ్రామాలు ముంపునకు గురికాగా 162.517 హెక్టార్ల అటవీ భూమిని సేకరించి మైనింగ్ చేపట్టారు. గని తవ్వకానికి ముందు ఆ ప్రదేశంలో ఉన్న సారవంతమైన భూమి పైపొర మట్టిని సుమారు 19,76 క్యూబిక్ మీటర్ల మేర తవ్వి వేరే చోట భద్రపర్చారు. ఓవర్ బర్డెన్ డంపులపై తిరిగి పర్చి ఈ మట్టిని పర్చి మొక్కలు పెంచారు. యాజమాన్యం చేపట్టిన ఈ చర్యలతో డోర్లి ఓబీ డంపుల మీద దట్టమైన అడవిగా ప్లాంటేషన్ ఏర్పడింది. అలాగే సీహెచ్‌పీ, కోల్ బంకర్ల వద్ద మిస్ట్ స్పేయర్లను ఏర్పాటు చేసింది. హాల్ రోడ్లకిరువైపులా పెద్దఎత్తున మొక్కలను నాటి గ్రీన్ బెల్ట్‌లు ఏర్పాటు చేశారు. జల కాలుష్యం జరగకుండా ఓసీపీ చుట్టూ పది కిలోమీటర్ల మేర గార్ల్యాండ్ డ్రెయినేజీ ఏర్పాటు చేయడంతో పాటు రెండు చెక్‌డ్యాంలను నిర్మించారు. వాతావరణ కాలుష్యం జరగకుండా డ్రిల్ మిషన్ల వద్ద డస్ట్ కలెక్టర్లను ఏర్పాటు చేసింది. వెట్ డ్రిల్లింగ్ నిర్వహించి వాటర్ స్ప్రింక్లర్లను వినియోగించారు. కోల్ బంకర్లు, సీహెచ్‌పీల వద్ద మిస్ట్ స్పేయర్లను ఏర్పాటు చేశారు. మూసివేసిన గని పరిసరాల్లోకి మనుషులు, పశువులు ప్రవేశించకుండా చుట్టూ రక్షణ కంచెను ఏర్పాటు చేసి, సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. మైన్‌క్లోజర్ ప్లాన్, భూ సంరక్షణ, పునరుద్ధరణ కార్యక్రమాలను ఖచ్చితంగా అమలు చేశారు.


