కోటపల్లి: చెన్నూర్ ఫారెస్టు డివిజన్ పరిధిలో ఈ ఏడాది తునికాకు సేకరణ లక్ష్యం దాటలేదు. అటవీశాఖ నిర్దేశించిన లక్ష్యానికి కన్నా తక్కువ 50 శాతం మాత్రమే సేకరించారు. చెన్నూర్ అటవీ డివిజన్ పరిధిలో తునికాకు యూనిట్లలో మే రెండోవారం నుంచి అధికారులు ఆకు సేకరణ ప్రారంభించారు. కొన్ని యూనిట్లలో మొదటి వారంలో ప్రారంభం కాగా, మరికొన్నింటిని మూడో వారంలో మొదలైంది. ఉపాధి పనులకు వెళ్లడం, ఎండ తీవ్రతతో ఆదివాసీలు, ఇతర కూలీలు సేకరణకు ఆసక్తిచూపలేదు. దీంతో ఆకు సేకరణ తగ్గినట్లు అటవీ అధికారులు పేర్కొంటున్నారు. అయితే గతంలో ఆకు సేకరణ ప్రారంభించిన పదిరోజుల్లోనే తునికాకు కట్టలు కల్లాల వద్ద నిండిపోయేవి. లక్ష్యంలో 40 శాతం వరకు పూర్తయ్యేది. ఈసారి మే 31తో ఆకుసేకరణ ముగిసినప్పటికి..ప్రభుత్వం ఆశించిన మేర లక్ష్యాన్ని చేరుకోలేదు.
10,600 ఎస్బీల లక్ష్యం..
చెన్నూర్ ఫారెస్టు డివిజన్ పరిధిలో 10,600 స్టాండర్డ్ బ్యాగులు(ఎస్బీ) ఆకు సేకరించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. సీజన్ ముగిసే సమయానికి కోటపల్లి రేంజ్ పరిధిలోని పార్‌పల్లి యూనిట్ టార్గెట్ 3 వేల యూనిట్లు ఉండగా కేవలం 1,398 బ్యాగులు మాత్రమే సేకరించారు. చెన్నూర్ పరిధిలో 5129.68 బ్యాగులను సేకరించారు. చెన్నూర్‌లో రెండు కన్నెపల్లి, భీమారం, కోటపల్లిలో పార్‌పల్లి, నీల్వాయిలో మూడు బద్దంపల్లి, మైలారం, నీల్వాయి మొత్తం ఆరు యూనిట్లలో సేకరణ జరిగింది. సుమారు కేవలం 50 శాతం మాత్రమే. గతేడాది సుమారు నిర్దేశించిన 62 శాతం లక్ష్యానికి ఈసారి ఆకుసేకరణ జరగలేదు.
గతం కన్నా తగ్గింది
గతం కన్నా ఈసారి తక్కువగా తునికాకు సేకరణ జరిగింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మన వద్ద ఆకు నాణ్యతగా ఉంటుంది. ఆకులు సేకరించి వారి వివరాలు ఆన్‌లైన్ చేశాం. డబ్బులు త్వరలోనే వారి ఖాతాలో జమవుతుంది.
– సదానందం, ఎఫ్‌ఆర్వో కోటపల్లి


