జన్నారం: ఇందూరు పోచమ్మ తల్లికి మొక్కు చెల్లించేందుకు ఆదివాసీ గిరిజనుల డీసీఎం వాహనాన్ని ఆర్టీఏ అధికారులు పట్టుకుని పోలీస్టేషన్‌కు తరలించగా, ఎటు పాలుపోలేని స్థితిలో ఉన్న వారికి మరో వాహనం ఏర్పాటు చేసి జన్నారం ఎస్సై ఉదయ్‌కిరణ్ ఔదార్యాన్ని చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు గ్రామదేవత ఇందూరు పోచమ్మ తల్లికి మొక్కులు తీర్చుకోవడానికి మూకుమ్మడిగా మల్యాలకు చెందిన సుమారు 50 మంది గిరిజనులు డీసీ ఎం వ్యాను ద్వారా కవ్వాల్‌కు సామగ్రితో గురువా రం బయల్దేరారు. జన్నారం వచ్చిన ఎంవీఐ.. డీసీ ఎంను తనిఖీ చేయగా పత్రాలు లేకపోవడంతో వ్యా న్‌ను పోలీసుస్టేషన్‌కు తరలించారు. స్టేషన్ ఎదురుగా గంటపాటు సామగ్రితో గిరిజనులు కూర్చున్నారు. ఎస్సై ఉదయ్‌కిరణ్ వెంటనే మరో డీసీఎం తెప్పించి, వారిని పోచమ్మ ఆలయానికి పంపించారు. ఎస్సైకి గిరిజనులు ధన్యవాదాలు తెలిపారు.


