అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు
అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు మేలు
నాణ్యమైన విత్తనంతోనే సాగు చేయాలి
జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ
‘సాక్షి’ ఫోన్ ఇన్‌కు రైతుల నుంచి విశేష స్పందన
అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు
అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు మేలు
నాణ్యమైన విత్తనంతోనే సాగు చేయాలి
జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ
సాక్షి ఫోన్ ఇన్‌కు రైతుల నుంచి విశేష స్పందన
మంచిర్యాలఅగ్రికల్చర్: ‘తొలకరి వర్షాలకు పత్తి విత్తనాలు వేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది. రెండు మూడు భారీ వర్షాలు కురిసి నేలలో 70నుంచి 80శాతం తేమ ఉన్నప్పుడే విత్తనం వేసుకోవాలి. డీలర్లు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. వర్షాభావ పరిస్థితులపై వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో రైతులు అధిక సాంద్రత(డబ్బా ఆకారం) పద్ధతిలో పత్తి సాగు, స్వల్పకాలిక వరి సాగు చేస్తే మేలు జరుగుతుంది..’ అని జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ సూచించారు. వానాకాలం సాగు సన్నద్ధతపై బుధవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి రైతులు అడిగిన సందేహాలు, సాగు సమస్యలపై జిల్లా వ్యవసాయ అధికారి(డీఏవో) సురేఖ, సహాయ వ్యవసాయ అధికారి గోపి నివృత్తి చేవారు.
యూరియా బస్తా రూ.350 నుంచి రూ.360 వరకు అమ్ముతున్నారు. ఇతర ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై చర్యులు తీసుకోవాలి. – సింగతి రవి, గ్రామం: బట్వాన్‌పల్లి, మం: బెల్లంపల్లి, మనికంఠ, గ్రామం: రెబ్బెన, రవీందర్, ప్రశాంత్, మం: కన్నెపల్లి, రాములు, గ్రామం: భీమిని
డీఈవో: ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే మండల ఏవో దృష్టికి తీసుకు రావాలి. భీమిని మండలంలో అధిక ధరకు ఎరువులు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి రావడంతో అతడిపై చర్యలు తీసుకున్నాం. యూరియా బస్తా రూ.266.50కు మాత్రమే విక్రయించాలి. పంట సాగుకు అనుగుణంగా యూరియా బుకింగ్ చేసుకుని విక్రయించాలి. నెల రెండు నెలలకు సరిపడా ముందస్తు కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం, ఒకరిని చూసి ఒకరు పో టీపడి కొనుగోలు చేయొద్దు. సాగు అవసరానికి అ నుగుణంగా ఎరువులు అందుబాటులో ఉంచాం.
వర్షాలు తక్కువగా ఉంటాయి అంటున్నారు. వరి సాగు చేయొచ్చా. తక్కువ వర్షాపాతం ఉంటే ఎలాంటి పంటలు వేసుకోవాలి. ఏ రకం వరి సాగు చేయాలి.. ఏ రకం వరికి ప్రభుత్వం బోనస్ ఇస్తుంది. – రమేష్, జన్నారం, శంకర్, నెన్నెల, బి.శ్రీనివాస్, కుందారం, ప్రసాద్, జైపూర్, చంద్రశేఖర్, గ్రామం: ముత్తపూర్, మం: కన్నెపెల్లి, బొలిశెట్టి లక్ష్మినారాయణ, దండేపల్లి, సీహెచ్.రవి, గ్రామం: ఆస్నాద, మం: చెన్నూర్, శేఖర్, వేమనపల్లి
డీఈవో: అధిక సాంద్రత పద్ధతి(డబ్బా ఆకారం)లో గుర్తింపు పొందిన పత్తి విత్తనాలు వేసుకోవాలి. ఎకరానికి నాలుగు నుంచి ఐదు ప్యాకేట్లు అవసరం అవుతాయి. 20వేల నుంచి 30వేల మొక్కలు వస్తాయి. చమత్కార్ రసాయన మందు ఎకరానికి 1ఎంఎల్ 1లీటర్ నీటి చొప్పున విత్తనం వేసిన 45, 65 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. చెట్టు ఎత్తు తక్కువలో మంచి కాయలు కాస్తాయి. 12నుంచి 14క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. జూలై మొదటి వారంలో విత్తుకుంటే డిసెంబర్‌లో పంట ఒకేసారి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. జనవరిలో ఇతర పంటలు సైతం వేసుకోవచ్చు.
రేగడి నేలలో పత్తి విత్తనాలు వేసుకోవచ్చా..? ఎలాంటి విత్తనం వేసుకోవాలి. పత్తిలో చీడపీడల వ్యాప్తి పెరుగుతుంది. నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. – మహేష్, కవ్వాల్, జన్నారం, జే.నారాయణ, నెన్నెల, సంతోష్, మందమర్రి
డీఈవో: నల్లరేగడి నేలలో పత్తి సాగు చేసుకోవచ్చు. ప్రభుత్వ గుర్తింపు పొందిన నాణ్యమైన విత్తనం డీలర్ల వద్ద కొనుగోలు చేసుకోవాలి. రెండు మూడు వర్షాలు కురిసిన తర్వాతనే విత్తనం వేసుకోవాలి. పత్తి మధ్యలో ఆరు నుంచి పది వరుసల మధ్యలో కంది విత్తన సాలు కూడా వేసుకుంటే మంచిది.
ఎలాంటి సేంద్రియ ఎరువులు వేసుకోవచ్చు. ఏవి అందుబాటులో ఉన్నాయి.
– బొమ్మెన మహేష్, దండేపల్లి
డీఈవో: సేంద్రియ ఎరువులు జీలుగ, జనుము, పిల్లిపెసర ప్రభుత్వం రాయితీపై అందిస్తుంది. ఇవి అందుబాటులో ఉన్నాయి. మార్కెట్‌లో లభించే పచ్చిరొట్టె, పెసర, జొన్న, గోధుమ వంటి పంటలు కలిపి సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవచ్చు.
ఇప్పుడు పత్తి విత్తనాలు వేసుకోవచ్చా.. ఎలాంటివి, ఎప్పటివరకు వేసుకోవాలి. – బనావత్ శివలాల్, గ్రామం: లింగపూర్, మం: దండేపల్లి, తాడ మహేష్, చెన్నూర్, తిరుపతి, నెన్నెల
డీఈవో: ప్రస్తుతం విత్తనాలు వేసుకునేందుకు అనువైన సమయం కాదు. చిన్నపాటి వర్షాలే కురిసాయి. ఒకట్రెండు భారీ వర్షాలు కురవాలి. జూలై 15 వరకు పత్తి విత్తుకునేందుకు గడువు ఉంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన నాణ్యమైన కంపెనీల విత్తనాలు కొనుగోలు చేసి రశీదు పొందాలి. దిగుబడి వచ్చే వరకు భద్రపర్చుకోవాలి. కలుపు నియంత్రణ, తక్కువ ధరకు లభించే గుర్తింపు లేని విత్తనాలు వేసుకుని నష్టపోవద్దు.
డీలర్లు యూరియా, డీఏపీ ఎరువులు కావాలంటే ఇతర ఎరువులు, రసాయన మందులు అంటగడుతున్నారు. ఇవి కొనుగోలు చేస్తేనే అవి ఇస్తాం అంటున్నారు. బెల్లంపల్లిలో ఎరువుల దుకాణం నిర్వాహకులు స్టాక్ వివరాలు, ధరలు పట్టిక ఏర్పాటు చేయడం లేదు.
– ప్రశాంత్, పెర్కపల్లి, బెల్లంపల్లి, మోహన్, భీమిని
డీఈవో: రైతులకు కావాల్సిన ఎరువులు మాత్రమే అందించాలి. యూరియాతోపాటు నానో యూరియా కూడా వినియోగించుకోవాలి. పత్తి పంట ఎకరానికి రెండు బస్తాల యూరియాతోపాటు ఒక లీటర్ నానో యూరియా కూడా వినియోగించాలి. అవసరం లేని ఎరువులు, రసాయన మందులు తీసుకోబోమని తేల్చి చెప్పండి. స్టాకు వివరాలు, ధరలు పట్టిక ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడైన వివరాలు లేకుంటే ఏవోకు ఫిర్యాదు చేయవచ్చు.


