ప్రభుత్వ పాఠశాలల్లో 72 చొప్పున ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులు
వెల్లువెత్తిన దరఖాస్తులు
ఇన్‌స్ట్రక్టర్‌కు 1893, ఆయాకు 378
వడపోతలో త్రిసభ్య కమిటీ నిమగ్నం
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులకు అభ్యర్థుల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ఖాళీలు తక్కువగా ఉన్నా దరఖాస్తులు వెల్లువెత్తడంతో ఉపాధి అవకాశాలపై ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తోంది. ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా 72 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య అమలు చేస్తోంది. బోధనకు ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ నెల 8వరకు ఆయా పాఠశాలల్లో దరఖాస్తులు స్వీకరించారు. 72 చొప్పున ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులు ఉండగా.. ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు 1893 మంది, ఆయా పోస్టులకు 378మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇన్‌స్ట్రక్టర్‌కు నెలకు రూ.8వేలు, ఆయాలకు నెలకు రూ.6వేలు గౌరవ వేతనం చెల్లిస్తారు.
పూర్వ ప్రాథమిక విద్య కోసం..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2026–27 విద్య సంవత్సరానికి పూర్వ ప్రాథమిక విద్య కోసం 72 ప్రీ ప్రైమరీ సెక్షన్ల ప్రారంభానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మూడేళ్ల వయస్సు పిల్లలను చేర్చుకుంటారు. ప్రతీ పాఠశాలకు రూ.లక్ష నిధులు కేటాయించింది. చిన్నపాటి మరమ్మతులు, పర్నిచర్, ఇండోర్–అవుట్‌డోర్ ఆట సామగ్రి, బాల పెయింటింగ్స్ సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు వచ్చాయి.
త్రిసభ్య కమిటీ ద్వారా ఎంపిక..
ప్రతీ పాఠశాల పరిధిలో స్థానికులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టుల అభ్యర్థుల ఎంపికకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో ఎంఈవో, ఎంపీడీవో, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లేదా సీడీపీవో సభ్యులుగా ఉంటారు. అభ్యర్థుల మార్కుల ఆధారంగా ఇన్‌స్ట్రక్టర్ల నియామకం జరగనుంది. డీఈడీ ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. అర్హతలు, మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ఎంపిక ప్రక్రియలో పారదర్శకత, నిష్పాక్షికతపై అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆయా పోస్టులకు ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చిన ఏడో తరగతి మార్కుల పట్టికను క్షుణ్ణంగా పరిశీలించాలని అభ్యర్థులు కోరుతున్నారు. త్రిసభ్య కమిటీ దరఖాస్తుల వడపోత చేపట్టి ఒకటి రెండు రోజుల్లో జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి జాబితాను అందజేయనున్నారు.
ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు మందమర్రి మండలంలో అత్యధికంగా 297 దరఖాస్తులు రాగా తర్వాత స్థానంలో బెల్లంపల్లి మండలంలో 258, నస్పూర్‌లో 213, మంచిర్యాలలో 176 దరఖాస్తులతో మూడంకెలు దాటాయి. ఆయా పోస్టుకు మందమర్రి మండలంలో 65, బెల్లంపల్లిలో 37, నెన్నెలలో 37, కోటపల్లిలో 35, నస్పూర్ మండలంలో 34 దరఖాస్తులు అందాయి.


