వరి ధాన్యం లారీల పట్టివేత | - | Sakshi
Sakshi News home page

వరి ధాన్యం లారీల పట్టివేత

Jun 11 2026 7:53 AM | Updated on Jun 11 2026 7:53 AM

కోటపల్లి: మండలంలోని రాపన్‌పల్లి ప్రాణహిత నదిపై ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వస్తున్న ఆరు వరి ధాన్యం లారీలను వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌ నుంచి టెండర్‌ వేసి తీసుకొస్తున్నట్లు బిల్లుల ద్వారా గుర్తించినట్లు సమచారం. లారీలన్నీ మహారాష్ట్రలోని కరుసవెల్లికి చెందిన ఓ వ్యక్తికి చెందినవి కావడంతో సదరు వ్యక్తి తెలంగాణలో రాజకీయ నాయకులు, అధికారులతో తనకున్న పలుకుబడి ఉపయోగించి ‘మామూలు’గా వదిలి వేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. పట్టుకున్న ఆరు లారీల్లో ఒకదాన్ని మాత్రమే కోటపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించగా.. మిగతా వాటిని చెన్నూర్‌ మండలం చింతపల్లి వద్దనే ఉంచి మరో రెండింటిని లక్ష్మిపూర్‌ పెట్రోల్‌బంక్‌లో ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, ఇటీవల మండలంలోని లక్ష్మిపూర్‌ గ్రామ సమీపంలో ధాన్యం లారీ పట్టుబడగా అధికారులు ‘మామూలు’గానే వదిలి వేసినట్లు తెలిసింది. పెద్దపల్లి జిల్లాలో లారీలు పట్టుబడగా విచారణలో రాపన్‌పల్లి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు మీదుగా వెళ్లినట్లు గుర్తించిన అధికారులు రహస్యంగా విచారణ జరిపి చేతులు దులిపేసుకున్నారు. ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, లారీల పట్టివేతపై తహసీల్దార్‌ రాఘవేంద్రరావును సంప్రదించగా.. సమావేశంలో ఉన్నానంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. సీఐ కృష్ణను సంప్రదించగా.. లారీలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement