దహెగాం: పురుగుల మందు తాగి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని పెసరికుంట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై చుంచు రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెసరికుంట గ్రామానికి చెందిన రాంటెంకి జ్యోత్స్న (17) కౌటాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన తన అక్క సంగీత (పెద్దమ్మ కూతురు) భర్త కత్తెర్ల అరుణ్‌తో అప్పుడప్పుడు ఫోన్‌లో చాటింగ్ చేస్తూ మాట్లాడేది. అక్క– బావల ఇంటికి తరచూ వెళ్లి వచ్చేది. జ్యోత్న్స తనతో చాటింగ్ చేస్తుందనే విషయాన్ని అరుణ్ భార్య సంగీతకు తెలిపాడు. దీంతో సంగీత ఈనెల 4న తన తల్లి కమలతో కలిసి పెసరికుంట గ్రామానికి వచ్చి జ్యోత్స్నను దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నారు. ఈనెల 7వ తేదీన మరోసారి బాలికపై దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక అదేరోజు సాయంత్రం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. బాలిక తండ్రి రాంటెంకి లస్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


