తాండూర్: ఇల్లు కూలి చిన్నారి మృతి చెందిన ఘటన తాండూర్ మండలం అచ్చలాపూర్ ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. తాండూర్ ఎస్సై ప్రసాద్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఏముర్ల శేఖర్ –భాగ్యలకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె ఏముర్ల సునైత్రి (5) వేసవి సెలవులు కావడంతో రోజూ ఇంటి సమీపంలోని పిల్లలతో కలిసి ఆడుకుంటుంది. ఈ క్రమంలో బుధవారం తన ఇంటి సమీపంలోని ఏముర్ల పోచవ్వ అనే వృద్ధురాలికి చెందిన ఇంటిలో మరో బాలికతో కలిసి ఆటలాడుతుండగా ఒక్కసారిగా ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో సునైత్రి అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలిక ప్రాణాలతో బయటపడింది. చిన్నారి సునైత్రి తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


