పీఎం విద్యాలక్ష్మి పథకంతో విద్యారుణాలు పూచీకత్తు లేకుండా స్వల్ప వడ్డీతో పంపిణీ పేద విద్యార్థులకు వరం
ఆదిలాబాద్: పేదరికం, ఆర్థిక సమస్యలతో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘పీఎం విద్యాలక్ష్మి’ పథకానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర విద్యా, ఆర్థిక, మానవ వనరుల శాఖలు, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్‌తో ఈ పథకానికి సంబంధించిన పోర్టల్‌ను ప్రత్యేకంగా రూపొందించాయి. ఈ పోర్టల్ ద్వారా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సుమారు 90 రకాల విద్యా రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి ఆస్తులు, పూచీకత్తు లేకుండానే బ్యాంకుల నుంచి రుణ సాయం పొందే వెసులుబాటు ఉంది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉన్నత విద్యావకాశాలను అందిపుచ్చుకోవాలనే నిరుపేద, బలహీన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది.
రూ.10 లక్షల వరకు..
ఈ పథకం ద్వారా విద్యార్థులకు వారి కోర్సు ఫీజుకు అనుగుణంగా మూడు వేర్వేరు విభాగాల్లో రుణాలు మంజూరు చేస్తారు. రూ.4 లక్షల లోపు, రూ.4 లక్షల నుంచి రూ. 7.50 లక్షల వరకు, రూ. 7.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అవసరమైన మొత్తాన్ని ఎంపిక చేసుకునే సదుపాయం ఉంటుంది. ఈ రుణాలు పొందేందుకు ఎలాంటి నిర్దిష్ట గడువు తేదీ లేదు. విద్యార్థులు ఏడాది పొడవునా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక కుటుంబం నుంచి కేవలం ఒక్కరికి మాత్రమే ఈ పథకంలో అవకాశం కల్పిస్తారు. కుటుంబ వార్షికాదాయం రూ.9 లక్షల కంటే తక్కువగా ఉండాలి. గరిష్టంగా రూ.7.5 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ పథకంలో రూ.10 లక్షల వరకు తీసుకునే రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. రుణాలకు కేంద్ర ప్రభుత్వమే పూచీకత్తుగా (గ్యారెంటీగా) వ్యవహరిస్తుండటంతో, బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. ఈ రుణం కేవలం ట్యూషన్ ఫీజుకే పరిమితం కాకుండా, హాస్టల్ ఖర్చులు, పరీక్షల ఫీజులు, ల్యాబ్ ఫీజులు, పుస్తకాలు, ఇతర విద్యాసామగ్రి కొనుగోలు వంటి అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చు.
కరువైన ప్రచారం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విద్యాలక్ష్మి పథకంపై అవగాహన, ప్రచార కార్యక్రమాలు కరువయ్యాయి. క్షేత్రస్థాయిలో బ్యాంకులు, విద్యా శాఖ నిర్లక్ష్యం కారణంగా పథకంపై ఎవరికీ సరిగ్గా తెలియదు. అర్హులైన విద్యార్థులు సమాచారం అందక ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. పూచీకత్తు లేని రుణాలు, వడ్డీ రాయితీల గురించి తెలియక మధ్యతరగతి, పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అందించే విద్యాలక్ష్మి రుణాలకు దూరమవుతున్నారు. అధికారులు, బ్యాంకులు క్షేత్రస్థాయిలో ప్రచారం కల్పించకపోతే, మారుమూల ప్రాంతాల ప్రతిభావంతులు వెనకబడిపోయే ప్రమాదం ఉంది.
దరఖాస్తు చేసుకోండిలా..
విద్యా రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు పీఎం విద్యాలక్ష్మి పోర్టల్ ( https:// pmvidyalaxmi. co. in/ Index. aspx) లో విద్యార్థి పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్, చిరునామా వివరాలతో నమోదు చేసుకోవాలి. అనంతరం ఈ పోర్టల్‌లో ఉన్న వివిధ బ్యాంకు రుణ పథకాలను పరిశీలించి తమకు నచ్చిన బ్యాంకును ఎంచుకోవాలి. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా మార్కుల జాబితా, కోర్సు సంబంధిత పత్రాలు, అడ్మిషన్ లెటర్ జత చేయాలి. అనంతరం ఎంచుకున్న బ్యాంకులో అకౌంట్ తెరిచి ఆ వివరాలను నమోదు చేసి, రుణ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. ఇలా దరఖాస్తు చేసిన తర్వాత, దాని పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లోనే పరిశీలించవచ్చు.
పోర్టల్‌లో నమోదైతేనే..
ఇంజినీరింగ్, మెడిసిన్, లా, మేనేజ్‌మెంట్, టెక్నికల్, సైంటిఫిక్, బీఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఆర్కిటెక్చర్, బీఎస్సీ, ఎమ్మెస్సీ, ఎంఏ, పరిశోధన కోర్సులతో పాటు, సీఏ, సీఎస్ వంటి డిగ్రీలను పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. దేశంలోని 1000కి పైగా ఉన్నత విద్యాసంస్థలలో ప్రవేశం పొందిన వారికి ఈ పథకం వర్తిస్తోంది. అయితే ఈ ఉన్నత విద్యా సంస్థలు విద్యాలక్ష్మి పోర్టల్‌లో నమోదై ఉండాలి.


