శ్రీరాంపూర్: గత నెల 31న అమెరికాలో మెట్రోస్టేషన్ మెట్లపై నుంచి పడి అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నస్పూర్ యువతి లగిశెట్టి స్పందనకు అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆట) అండగా నిలిచింది. ‘అయ్యో బిడ్డా.. వచ్చేదెట్లా’ శీర్షికన ఈ నెల 4న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో పలువురు దాతలు, మానవతావాదులు వైద్యానికి విరాళాలు అందిస్తున్నారు. తల్లిదండ్రులు శ్రీనివాస్, సునిత ఆర్థిక పరిస్థితి అంతంగా మాత్రంగా ఉండడంతో ఆదుకోవడానికి పలువురు ముందుకు వస్తున్నారు. నస్పూర్ కార్పొరేటర్ రాచకొండ గోపాల్‌రావు, నాయకులు రాచకొండ వెంకటేశ్వర్‌రావు, రిటైర్డ్ ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ గందె వేణుమాధవ్‌రావు మంగళవారం రాత్రి అమెరికాలోని ఆట సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. తల్లిదండ్రుల పరిస్థితి వివరించి స్పందన చికిత్సకు ఆర్థికంగానే కాకుండా అక్కడ ఆసుపత్రి, పోలీస్‌స్టేషన్‌లో అన్ని రకాల సహకారం అందించాలని అమెరికా ఆట అధ్యక్షుడు చల్లా జయంత్, చికాగో పట్టణ ఆట సేవక్ కమిటీ ఇన్‌చార్జీ మహిపాల్‌ను కోరారు. దీంతో మహిపాల్ ఆసుపత్రి వద్దకు వెళ్లి స్పందనను పరామర్శించి, వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.
అక్రమంగా పట్టా చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి
జన్నారం: ఆదివాసీ మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సర్వే నంబర్ 80లోని భూమిని కబ్జా చేసి అక్రమ పట్టా చేసుకున్న వారిపై చర్యలు తీసుకుని, భూమి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆదివాసీ గిరిజనులు నిరసన ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైటాయించారు. పలువురు ఆదివాసీ సంఘ నాయకులు మాట్లాడుతూ జన్నారం గ్రామ పంచాయతీ గడ్డంగూదకు చెందిన సోయం పారుబాయికి చెందిన సర్వే నంబర్ 80లోని భూమిని జన్నారం మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమంగా పట్టా చేసుకున్నారని ఆరోపించారు. అక్రమంగా పట్టా చేసుకున్న భూమిని తిరిగి మహిళకు ఇవ్వకుంటే జిల్లా వ్యాప్త ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి అక్కడికి చేరుకొని ఆదివాసీ సంఘ నాయకులతో మాట్లాడారు. అనంతరం వారు తహసీల్దార్ బక్కయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ విషయంలో విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆదివాసీ సంఘ నాయకులు, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్‌కుమార్, కొట్నాక మనోజ్, మర్సకోల మాణిక్‌రావు, దుందేరావు తదితరులు పాల్గొన్నారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
కోటపల్లి: మండలంలోని నక్కలపల్లి గ్రామానికి సమీపంలో పేకాట ఆడుతున్నారనే ముందస్తు సమాచారం మేరకు బుధవారం కోటపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 8 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.47,200 నగదుతో పాటు 7 మొబైల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. దాడుల్లో నీల్వాయి ఎస్సై జగదీశ్, స్పెషల్‌పార్టీ పోలీసులు పాల్గొన్నారు.


