శాంతిఖని గనిని సందర్శించిన ఆస్ట్రేలియా బృందం | - | Sakshi
Sakshi News home page

శాంతిఖని గనిని సందర్శించిన ఆస్ట్రేలియా బృందం

Jun 11 2026 7:53 AM | Updated on Jun 11 2026 7:53 AM

బెల్లంపల్లి: మందమర్రి ఏరియా శాంతిఖని భూగర్భ గనిని బుధవారం ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం సందర్శించింది. మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్‌.రాధాకృష్ణ పర్యవేక్షణలో నలు గురు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం గనిలో దిగి బొగ్గు వెలికితీత చర్యలపై ప్రత్యక్షంగా అధ్యయనం చేశారు. బొగ్గు ఉత్పత్తి సాధన కోసం గతంలో జాయ్‌ కంపెనీతో ఒప్పందం చేసుకోగా కొంతకాలం పాటు ఆ ప్రక్రియ నిర్వహించారు. ఒప్పంద కాలపరిమితి ముగియడంతో తిరిగి ఆస్ట్రేలియాకు చెందిన తాలిస్మాన్‌ కంపెనీతో ఒప్పందం చేసుకోవడానికి సింగరేణి యాజమాన్యం యత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా భూగర్భంలో దిగిన ఆస్ట్రేలియా బృందం పనిస్థలాలను ప్రత్యక్షంగా పరిశీలించింది. బొగ్గు నిక్షేపాల ఉనికి, వెలికితీత చర్యలపై ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. గనిలో ఇంకా అపారమైన బొగ్గు సంపద ఉందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వెలికితీయడం సులువేనని ఆస్ట్రేలియా కంపెనీ ప్రతినిఽధి వర్గం నిర్ధారించింది. మరో రెండు నెలల వ్యవధిలో మరోమారు సందర్శించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రేలియా కంపెనీ ప్రతినిధులు ఇచ్చే నివేదికపై ఆధారపడి గనిలో బొగ్గు వెలికితీత జరగనుంది. తుది నిర్ణయం సింగరేణి యాజమాన్యం తీసుకోనుంది. గనిని సందర్శించిన వారిలో ఆస్ట్రేలియా కంపెనీ ప్రతినిధులు గ్రాంట్‌ ఫోల్డ్‌, జెరాల్డ్‌ మిల్లర్‌, నందన్‌, సిన్హా, గని ఏజెంట్‌ ఖధీర్‌, సంతోష్‌కుమార్‌, గని మేనేజర్‌ సంజయ్‌కుమార్‌ సిన్హా, ఇంజనీర్‌ బసవరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement