22,710 కేసుల పరిష్కారం
పాలమూరు: లోక్ అదాలత్‌లో ఒక్కసారి రాజీ అయితే శాశ్వత పరిష్కారం లభిస్తుందని, కక్షిదారులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత అన్నారు. ఇరువర్గాలకు సమయం ఆదా కావడంతో పాటు ప్రశాంత జీవనం లభిస్తోందన్నారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం కోర్టు ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు.
జిల్లా ప్రధాన కోర్టులో నాలుగు బెంచీలు, జడ్చర్ల కోర్టులో రెండు బెంచీలు ఏర్పాటు చేసి ఒక్కో బెంచీలో ఒక న్యాయమూర్తి ఆధ్వర్యంలో కేసులు పరిష్కరించారు. దీంతో రాత్రి 8 గంటల వరకు ఆరు బెంచీల్లో కలిపి 22,710 కేసులు పరిష్కరించారు. అదేవిధంగా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులో నష్టపరిహారం కింద ఒకరికి రూ.66 లక్షలు, మరొకరికి రూ.22 లక్షలు అవార్డును కక్షిదారులకు న్యాయమూర్తి అందించారు. ఓ దివ్యాంగుడికి వీల్‌ఛైర్, మరొకరికి ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి, న్యాయమూర్తులు కల్యాణ్ చక్రవర్తి, ఇందిర, రాధిక, మమతారెడ్డి, భావన, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ లోక్ అదాలత్‌లో పోలీస్ శాఖకు సంబంధించి మొత్తం 1,780 కేసులు పరిష్కరించారు. ఇందులో ఐపీసీ 197, డ్రంకన్‌డ్రైవ్ 499, ఈ–పెట్టీ కేసులు 1059 రాజీ చేశారు. అలాగే సైబర్ నేరాల్లో రూ.25 వేల లోపు నష్టపోయిన వాటిలో ఎఫ్‌ఐఆర్ కానీ వాటిలో 89 కేసులు పరిష్కరించి రూ.4.22లక్షల నగదు ఆయా బాధితుల ఖాతాల్లో జమ చేశారు. రూ.25 వేల కంటే ఎక్కువ నగదు కోల్పోయి ఎఫ్‌ఐఆర్ అయిన కేసుల్లో 25 కేసులు పరిష్కరించి రూ.12.74 లక్షల నగదు సంబంధిత బాధితుల ఖాతాల్లో జమ చేశారు.
కక్షిదారులకు నష్టపరిహారం అందజేత
పోలీస్ శాఖలో 1780 కేసులు రాజీ
సైబర్ నేరాల్లో రూ.17లక్షల నగదు బాధితుల ఖాతాల్లో జమ


