నిబంధనలు పాటించని
బ్లడ్ బ్యాంకులు..
ఎంజీఎం బ్లడ్ బ్యాంకులో కరువైన రక్త నిల్వలు
కాశిబుగ్గ : వరంగల్‌లోని మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల (ఎంజీఎం).. పేద రోగులకు పెద్ద దిక్కు. ఖరీదైన వైద్యం పొందలేని అభాగ్యులకు కొండంత ధైర్యం. అందుకే ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాలకు వైద్యసేవలు అందిస్తోంది. అయితే ఇంతటి పేరుగాంచిన ఎంజీఎంలో రక్తపు నిల్వలు కరువయ్యాయి. ఎంజీఎంతో పాటు సీకేఎం, హనుమకొండలోని ప్రసూతి ఆస్పత్రి రక్త నిధి కేంద్రాలకు ఎంజీఎం బ్లడ్ బ్యాంకు అమ్మ ఒడిగా పనిచేస్తుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లకు రక్తం కావాల్సి వస్తే చుక్క కూడా దొరకని దుస్థితి ఏర్పడింది. ఈ వేసవిలో రక్తం కావాలంటే ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకు పరుగులు తీయాల్సి వస్తోంది. దాదాపు నెలరోజుల పైనుంచి ఇదే పరిస్థితి చోటు చేసుకోవడంతో పేషెంట్లు, అటెండెంట్లు ఆందోళన చెందుతున్నారు. పేదరికంలో ఉన్న తాము ఉచిత వైద్యం కోసం వస్తే బ్లడ్ బ్యాంకులో రక్తం లేదంటున్నారని వారు వాపోతున్నారు. వార్డుల్లోని వైద్యులు రక్తం కోసం తొందరపెట్టగానే తాము వేలాది రూపాయలు ఖర్చు చేసి, ప్రైవేట్‌గా కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రక్తదాతలకు కరువైన ప్రోత్సాహం..
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చే రక్తదాతలకు ప్రోత్సాహం కరవైంది. బ్లడ్ బ్యాంకులో డోనర్ మోటివేటర్లు, కౌన్సిలర్లు లేకపోవడంతో స్వచ్ఛందగా వచ్చే రక్తదాతలు కరవవుతున్నారు. అలాగే, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంలో అధికారులు అంతగా ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీనిని అదునుగా చూస్తున్న ప్రైవేట్ బ్లడ్ బ్యాంకు నిర్వాహకులు వ్యాపారం చేసుకోవడానికి కలిసి వస్తోంది. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు రక్తం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసుకుంటూ తమ కుటుంబీకులను బతికించుకుంటున్నారు.
సిబ్బంది లేమితో తప్పని తిప్పలు..
ఎంజీఎంలోని బ్లడ్‌బ్యాంకును సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇందులో పది మంది వరకు సిబ్బంది పనిచేయాల్సి ఉంది. అయితే కేవలం నలుగురు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే, ఇటీవల నలుగురు ఔట్ సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్లను తొలగించారు. ఇదే క్రమంలో రక్తదాతలను ప్రోత్సహించడానికి బ్లడ్ డోనర్ మోటివేటర్లు, కౌన్సిలర్లు లేరు. దీంతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం సిబ్బందికి సమస్యగా మారుతుంది. ముఖ్యంగా వేసవిలో యూత్, ఇతర దాతలు రక్తదానం చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో బ్యాంకులో రక్తం నిల్వలు జీరోకు చేరుకున్నాయి.
వరంగల్, హనుమకొండలోని ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి ప్రైవేట్ బ్యాంకులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి సేకరించిన రక్తంలో కనీసం 30శాతం ఎంజీఎం బ్లడ్ బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది. అయితే ఈ ఉత్తర్వులను అమలు చేయకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే, ప్రైవేట్ బ్యాంకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రక్తాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నారు. దీనిపై ఇప్పటికై నా ఆస్పత్రి నిర్వాహకులు స్పందించి రక్తపు నిల్వలు సమకూర్చడంతో పాటు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల అక్రమ వ్యాపారానికి అడ్డు కట్ట వేయాలని రోగులు, బంధువులు కోరుతున్నారు.
బ్లడ్ మోటివేటర్, కౌన్సిలర్ లేక తగ్గిన రక్తదాన శిబిరాలు
రక్తంతో వ్యాపారం చేస్తున్న ప్రైవేట్
బ్లడ్ బ్యాంకులు
ప్రాణాపాయ స్థితిలో వాటిని
ఆశ్రయిస్తున్న బాధితులు


