పట్టుతప్పుతున్న పాలన.. ఆర్‌ఎంఓలపై ఆధారం | - | Sakshi
Sakshi News home page

పట్టుతప్పుతున్న పాలన.. ఆర్‌ఎంఓలపై ఆధారం

Jun 13 2026 1:11 PM | Updated on Jun 13 2026 1:11 PM

ఎంజీఎంలో ఇంకా భర్తీకాని

సూపరింటెండెంట్‌ పోస్టు

కాశిబుగ్గ : వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో వారం రోజుల నుంచి ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ స్థానంలో ఎవరూ లేకపోవడంతో పాలన పట్టుతప్పుతోంది. ఒకవైపు వైద్యుల కొరత, మరోవైపు నర్సింగ్‌, మినిస్టీరియల్‌ సిబ్బంది కొరతతో అత్యవసర విభాగంతోపాటు వార్డుల్లో వైద్యసేవలకు అంతరా యం ఏర్పడుతుందని ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది సిబ్బంది ఉదయం 11 గంటలు దాటినా విధులకు హాజరు కావడం లేదని తెలుస్తోంది. అలాగే, సాయంత్రం ఓపీలు సరిగా జరగడం లేదని పలువురు రోగులు చెబుతున్నారు. సిబ్బంది అయితే పేషెంట్లను స్ట్రెచర్‌, వీల్‌చైర్‌పై తీసుకెళ్లేందుకు డబ్బులు అడుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక రాత్రివేళ డ్యూటీ కి నామమాత్రంగా విధులకు హాజరవుతున్నట్లు సమాచారం. కాగా, అడ్మినిస్ట్రేషన్‌ పరంగా ఇబ్బందులు రాకుండా ఆర్‌ఎంఓలు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు ఆర్‌ఎంఓలకుగాను ఇద్దరు ఆస్పత్రికి సంబంధించిన ఇండెంట్లపై సంతకాలు చేస్తూ, వచ్చిన వారికి సమాధానం చెప్పడానికి పరిమితమవుతున్నారు.

గతంలో పనిచేసిన వారే వస్తున్నారా?

ఎంజీఎం సూపరింటెండెంట్‌గా ఎవరు వస్తారనే చర్చ ఆస్పత్రి వర్గాల్లో జోరుగా సాగుతోంది. డీఎంఈ స్థాయిలో ఈ పోస్టు ఉండటంతో ఫలానా అధికారి వస్తున్నారని ఊహించని పరిస్థితి నెలకొంది. గతంలో ఇక్కడ పనిచేసినవారు రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరు మూడో వ్యక్తికి తెలియకుండా ఆర్డర్‌తోనే రావాలని చూస్తున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement