ఓటు చోరీపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఓటు చోరీపై అప్రమత్తంగా ఉండాలి

Jun 13 2026 1:11 PM | Updated on Jun 13 2026 1:11 PM

ఓటు చోరీపై అప్రమత్తంగా ఉండాలి

హన్మకొండ: కేంద్రంలో నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనం చేస్తూ కుట్రలకు పాల్పడుతోందని వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య ఆరోపించారు. హనుమకొండలోని అంబేడ్కర్‌ భవన్‌లో వర్ధన్నపేట నియోజకవర్గస్థాయి బూత్‌ లెవల్‌ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఎంపీ కావ్య మాట్లాడుతూ ఓటర్ల జాబితాల సవరణలతో బీజేపీ ప్రమాదకర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఓటు చోరీ ప్రయత్నాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతీ బూత్‌ లెవల్‌ ఏజెంట్‌ పార్టీకి సైనికుడిలా పనిచేయాలని సూచించారు. వచ్చే మూడు నెలలు డోర్‌ టు డోర్‌ ఓటర్‌ వెరిఫికేషన్‌ చేపట్టాలన్నారు. ప్రతీ అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే కాంగ్రెస్‌ లక్ష్యమన్నారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే ప్రయత్నాలను అడ్డుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో అవకతవకలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దేశాన్ని అప్రమత్తం చేస్తున్నారని వివరించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు పోరాటం చేస్తోందని అన్నారు. ఈనెల 25 నుంచి రాష్ట్రంలో ప్రారంభంకానున్న ‘స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌’ను ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, కాంగ్రెస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ‘కుడా’ చైర్మన్‌ ఇనగాల వెంకట్రాంరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు మాట్లాడారు. కాంగ్రెస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఆయూబ్‌, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఎర్ర ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

నాలుగోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర

వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement