ఆదోని: ఆదోని పట్టణంలో శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రహరీ గోడ ఓ భాగం పదిహేను అడుగుల మేర కూలిపోయింది. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో వాహనాలు, పాదాచారుల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. స్థానికుల కథనం ప్రకారం రాత్రంతా కురిసిన భారీ వర్షానికి బ్రిడ్జిపై నీరు నిల్వ ఉండటంతో పాటు ప్రహరీగోడ నిర్మాణం బలహీనపడి ఒక్కసారిగా కూలిపోయింది. శిథిలాలు కింద ఉన్న దుకాణాల ముందు పడిపోయాయి. ఉద యం ఈ దృశ్యాన్ని గమనించిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గోడ కూలిన ప్రాంతంలో వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే సాంకేతిక నిపుణులతో తనిఖీలు నిర్వహించి ఫ్లైఓవర్ భద్రతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.


