● మే నెల 4 నుంచి నిలిచిపోయిన చెల్లింపులు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో వేలాది కుటుంబాలు వ్యవసాయ పనులు లేకపోవడంతో ఉపాధి పనులనే నమ్ముకున్నారు. అయితే రోజులు, వారాలు గడుస్తున్నా వేతనాలు అందక నిరాశకు లోనవుతున్నారు. గత మే 4వ తేదీ నుంచి వేతనాలు నిలిచిపోయాయి. వేసవిని ఉపాధి పనులకు సీజన్‌గా వ్యవహరిస్తారు. ఉమ్మడి జిల్లాలో మే నెలలో రోజుకు 2 లక్షల మంది శ్రామికులు హాజరయ్యారు. ఉదయమే తినీతినక వెళ్లి రెక్కలు ముక్కలు చేసుకుంటే వేతనాలు దక్కక దిక్కుతు చూస్తున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం రోజుకు లక్ష మందికి పైగా శ్రామికులు మాత్రమే ఉపాధి పనులకు హాజరువుతున్నారు. వేతనాలు అందక ఆకలి బాధలతో ఉపాధి కూలీలు రోడ్డెక్కాల్సి వస్తోంది. కర్నూలు జిల్లాలోని పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, పెద్దకడుబూరు, హాలహర్వి, ఆలూరు, ఆదోని, కోసిగి, దేవనకొండ, హొళగుంద, ఆస్పరి, నంద్యాల జిల్లాలోని డోన్, ప్యాపిలి, బేతంచెర్ల, కొలిమిగుండ్ల తదితర మండలాలకు ఉపాధి పనులే ఆధారం. కర్నూలు జిల్లాలో 1.25 లక్షల కుటుంబాలు, నంద్యాల జిల్లాలో 75 వేల కుటుంబాలు వేసవిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకున్నాయి. అయితే దాదాపు నెలన్నర రోజుల్లో దాదాపు 60 లక్షల పని దినాలకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. రోజుకు ఉపాధి శ్రామికుల వేతనం రూ.300 వరకు లభిస్తుంది. ఈ ప్రకారం 60 లక్షల పని దినాలకు రూ.180 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోవడం గమనార్హం.
ఒక్క గ్రామానికే రూ.30 లక్షల బకాయి
ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామంలో ఉపాధి శ్రామికులు ఎక్కువ. మే నెల 4 నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ఉపాధి శ్రామికులు 10,300 పని దినాలను వినియోగించుకున్నారు. ఈ ఒక్క గ్రామానికే దాదాపు రూ.35 లక్షల బకాయి ఉంది. ఫలితంగా ఇటీవల కాలంలో ఉపాధి పనులకు హాజరు తగ్గిపోయింది.


