గ్రామంలో 60 మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు
ప్రతి ఇంట్లోనూ ఉన్నత విద్యావంతులు
సేవల్లో ఆదర్శంగా నిలుస్తున్న ఉద్యోగులు, గ్రామస్తులు
స్థితిగతులు మార్చిన చదువు
చెన్నాపురం ఏరియల్ ఫ్యూ
ఎమ్మిగనూరుసెంట్రల్: మట్టిని నమ్ముకున్న రైతులు తమ కష్టం బిడ్డలకు వద్దని వారిని బాగా చదివించారు. వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కలలను బిడ్డలు నిజం చేశారు. ఇప్పుడు చెన్నాపురం అంటే ఉద్యోగులపురంగా ఖ్యాతి గడించింది. ఎమ్మిగనూరు మండలంలోని చెన్నాపురం గ్రామంలో 320 కుటుంబాలు ఉన్నాయి. వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ పత్తి, వరి, వేరుశనగ, మిరప పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. గ్రామంలో ప్రతి ఇంట్లో డిగ్రీ, పీజీ చేసిన విద్యావంతులున్నారు. గ్రామంలో 60 మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా అధికంగా ఉపాధ్యాయ, పోలీస్ శాఖలో కొలువుదీరారు.
ప్రభుత్వ పాఠశాలలోనే చదువులు
గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలోనే చదివారు. ఉత్తమ విద్య ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందని గ్రామస్తుల నమ్మకం. గ్రామంలోని యువత తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూసి ఎటువంటి చెడు అలవాట్లకు పోకుండా చక్కగా చదువుకుని ఉన్నత విద్యావంతులుగా తయారయ్యారు. వ్యవసాయంలో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఒక వైపు చదువుతూనే ఉద్యోగాలు సాధించి కన్నవారి కలలను సాకారం చేశారు.
గ్రామాభివృద్ధి పేరిట సేవా కార్యక్రమాలు
గ్రామంలో ఉద్యోగాలు సాధించి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఉద్యోగులు గ్రామాభివృద్ధి కోసం కూడా పా టు పడుతున్నారు. చెన్నాపురం గ్రామాభివృద్ధి సంఘం పేరిట వివిధ సేవా కార్యక్రామాలు చేపట్టారు. పేదల కు చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, పోటీ పరీక్షలకు మెటీరియల్ అందించారు. పదో తరగతి, ఇంటర్‌మీడియట్‌లలో అత్యధిక మార్కులు సాధించిన వారికి ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేశారు. నూతనంగా ఉద్యోగాలు సాధించిన వారికి సన్మానాలు చేశారు.
దశాబ్దాల క్రితం చెన్నాపురంలో నిరక్షరాస్యత అధికంగా ఉండేది. సంప్రదాయ వ్యవసాయంతో కుటుంబాలను నెట్టుకొచ్చేవారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టాల రావడంతో పిల్లలు భవిష్యత్తులో కష్టపడకూడదని బడిబాట పట్టించారు. ఇది ఆ ఊరి స్థితి గతులను మార్చింది. నాడు ఒక్కరితో మొదలైన ప్రభుత్వ కొలువు నేడు పదుల సంఖ్యకు చేరింది. ఉపాధ్యాయ వృత్తిలో 14 మంది, పోలీస్‌శాఖలో 25 మంది రాణిస్తున్నారు. పోలీస్ శాఖలో ఒకరు సీఐగా, మరొకరు ఎస్‌ఐగా ఉన్నారు. గ్రామంలో ఇద్దరు ఎంబీబీఎస్ చదువుతున్నారు. మరికొంతమంది సాఫ్ట్‌వేర్, ఇతర ప్రైవేట్ రంగాల్లో రాణిస్తున్నారు.


