కర్నూలు(సెంట్రల్): రేపటి నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్)సర్వే ప్రారంభం కానుంది. ఈ సర్వేకు 2002 ఓటరు జాబితా అత్యంత కీలకం. ఈ జాబితా 2025 జాబితాలను పోల్చుతూ సర్వే చేస్తారు. ప్రస్తుతం జాబితాలో పేరు ఉండి.. 2002 జాబితాలో పేరు లేకపోతే ఏమి చేయాలన్నదే సందేహం. ఈ క్రమంలో ఓటర్ల సందేహాలను తీర్చేందుకు ఎన్నికల కమిషన్ ముందుకొచ్చింది.
జాబితాలో పేర్లు లేని సందర్భాలు..
● 2002లో పెళ్లి చేసుకొని అత్తగారి ఊరికి వెళ్లిన ఆడవాళ్లు
● 2002లో ఓటు హక్కు వయసు రాకపోవడం
● 2002లో ఓటు హక్కు వచ్చినా ఏదైనా కారణం చేత ఓటరుగా నమోదు కాకపోవడం
● ప్రస్తుతం పైన చెప్పిన సందర్భాల ఓటర్ల వివరాలు 2025 జాబితాలో ఉంటాయి. అయితే 2002 జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో ‘సర్’ సర్వేలో సందేహాత్మక ఓటర్లుగా నిలుస్తారు. ఈ క్రమంలో వారంతా కింది నిబంధనలను ఫాలో అయితే 2002 జాబితాలో పేర్లు లేకపోయినా ఎన్నికల కమిషన్ ఓటరుగా ఆమోదిస్తుంది.
ఆ నిబంధనలు
ఏమిటంటే..
● వీరు పుట్టిన ఊరికి వెళ్లాలి.
● అక్కడ 2002 జాబితాలో అమ్మ, నాన్న, తాత/అవ్వల పేరు ఉంటే వారి పేరు, సీరియల్ నంబర్ తెలుసుకోవాలి.
● ఆ సీరియల్ నంబర్‌ను మీరు ఇప్పుడు ఉంటున్న బీఎల్‌ఓకి ఇవ్వాలి.
● బీఎల్‌ఓ ఆ నంబర్‌తో సరిపోల్చుకొని జాబితాలో మ్యాపింగ్ చేస్తారు.
ఇది చేయకపోతే ఏమి జరుగుతుంది?
● ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది.
● 2002 ఓటరు జబితా ఎక్కడ దొరుకుతుంది?
● ప్రతి ఊరి తహసీల్దార్ ఆఫీసు నుంచి 2002 ఓటరు లిస్టులను ఆ ఊరి బీఎల్‌ఓ/అంగన్‌వాడీ టీచర్‌కు ఇచ్చారు.
● మీరు పుట్టిన ఊరి బీఎల్‌ఓని కలిసి జాబితాను పొందవచ్చు.


