గా‘జల’దిన్నె వెలవెల!
గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టులో నీటి నిల్వ రోజు రోజుకు తగ్గిపోతోంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.3 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గతేడాది జూన్ నెల ప్రారంభం అయ్యే సరికి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరిది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు చుక్కనీరు రాలేదు. గతంలో జూన్ నెలలో 2 టీఎంసీలు నీరు నిల్వ ఉండి డోన్, కృష్ణగిరి, పత్తికొండ ప్రాంతాల్లో 120 గ్రామాలకు సరఫరా అయ్యేది. కర్నూలు, కోడుమూరు, లద్దగిరి, గూడూరు, బెళగల్, గుడిపాడు ప్రాంతాలకు తాగునీటి కోసం సరఫరా చేసేవారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటితో తాగునీటి పథకాలకు ఇబ్బంది లేదని అధికారులు తెలుపుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది రబీలో ప్రాజెక్టు కింద దాదాపు 13 వేల ఎకరాలలో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాదైన వర్షాలు కురిసి ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరుతుందో లేదో వేచిచూడాలి. ఇదిలా ఉండగా ప్రాజెక్టులో ఉన్న నీటిని ఇతర ప్రాంతాల వారు తమ రాజకీయ బలంతో నీటిని మళ్లించుకుని వెళ్తున్నారు. దీంతో ప్రాజెక్టు చుట్టు పక్కల గ్రామాలకు తాగునీటి సమస్య వస్తే ఎలా అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.


