● అసాంఘిక శక్తులపై అప్రమత్తంగా ఉండాలి ● బిషప్ ది రైట్ రెవ.డా.పి.ఐజక్ వరప్రసాద్
ఆదోని: క్రైస్తవ సంఘం అనేది ఒక క్రమాని కి, పవిత్రతకు ప్రతీక అని సీఎస్‌ఐ రాయలసీమ డయాసిస్ బిషప్ ది రైట్ రెవరెండ్ డా.పి.ఐజక్ వరప్రసాద్ తెలిపారు. చర్చీల్లో చొరబడుతున్న కొన్ని అసాంఘిక శక్తులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాయలసీమలోని ఐదు జిల్లాల్లో కొన్ని సీఎస్‌ఐ చర్చీల్లో కొందరు కాపరులే (పాస్టర్లు) బాధ్యతలు తప్పి ప్రవర్తించటం బాధాకరమని పేర్కొన్నారు. అటువంటి వారిపై ఇప్పటికే క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కొందరు డయాసిస్ చట్ట సభలు, సమావేశాల్లోకి దౌర్జన్యంగా చొరబడి, తోటి గురువులపై భౌతిక దాడులకు పాల్పడ్డారని, ఎనిమిది మందిపై కడప వన్‌టౌన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేయించామని పేర్కొన్నారు. అలాగే వాట్సాప్ ద్వారా చేస్తున్న అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయిస్తామని తెలిపారు. ఇప్పటికే వాట్సాప్ గ్రూపు అడ్మిన్‌లపై తగు చర్యల కోసం సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశామన్నారు. ఇలాంటి వాట్సాప్ గ్రూపుల నుంచి గురువులు తక్షణమే వైదొలగాలని, ఇప్పటికే అల్లరిమూకలో ఉన్న కొందరిని డయాసిస్ నుంచి బహిష్కరించినట్లు తెలిపారు.


