● నలుగురు దొంగలు అరెస్ట్
● నాలుగు బైకులు స్వాధీనం
మహానంది: దేవస్థానం ప్రాంగణంలోని ఆలయ గేటు వద్ద ఉంచిన రెండు బైకులను చోరీ చేసిన నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు నంద్యాల ఏఎస్పీ మందాజావళి ఆల్ఫోన్స్ తెలిపారు. సీఐ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మహానంది దేవస్థానం సూపరింటెండెంట్ పి.సుబ్బారెడ్డి, మరో ఉద్యోగి గురుప్రసాద్‌కు చెందిన పల్సర్, హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌లు ఈ నెల 9వ తేదీన చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీఎస్ పోలీసుల సహకారంతో నిందితులను పట్టుకున్నారు. నిందితులు నంద్యాల పట్టణంలోని ఎంఎస్ నగర్ బర్మశాలకు చెందిన పాల్తీ గోపీనాయక్, మేనుగ రాజు (కర్నూలు) ఎన్‌జీఓస్ కాలనీ, డోన్ మండలం చిన్నమల్కాపురానికి చెందిన దొడ్డగాళ్ల ప్రకాష్, దేవనగర్‌కు చెందిన షేక్ సాబిర్ హుసేన్‌గా తెలిసింది. వారి నుంచి మహానందితో పాటు నంద్యాల త్రీటౌన్, ఆళ్లగడ్డ టౌన్ పరిధిలో చోరీ చేసిన నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బైకుల విలువ రూ. 2.70 లక్షలు ఉంటుందని వెల్లడించారు.
డూప్లికేట్ తాళాలతో చోరీలు
మద్యం, చెడు అలవాట్లకు బానిసలైన నిందితులు తప్పుదారి పట్టి బైక్‌ల దొంగతనాలకు పాల్పడుతున్నారని ఏఎస్పీ మందా జావళి తెలిపారు. డూప్లికేట్ తాళాలు ఉపయోగించి బైకులను చోరీ చేస్తున్నారని చెప్పారు. సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి బైకులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కేసును చేధించిన సీసీఎస్, మహానంది పోలీసులను ఎస్పీ సునీల్ షెరాన్ అభినందించారు.


