కన్నూమన్ను కానక.. | - | Sakshi
Sakshi News home page

కన్నూమన్ను కానక..

Jun 4 2026 7:09 AM | Updated on Jun 4 2026 7:09 AM

● మట్టి దందాలో టీడీపీ నాయకుల మధ్య తీవ్ర విభేదాలు ● అక్రమ సంపాదన కోసం వర్గాలుగా విడిపోయి పరస్పర ఆరోపణలు ● సోషల్‌ మీడియాలో బహిరంగంగా విమర్శిస్తూ పోస్టులు పెడుతున్న వైనం ● అక్రమ మట్టి దందాను ప్రశ్నించినందుకు ఇద్దరు టీడీపీ నాయకుల అరెస్టు ● తిరువూరు నియోజకవర్గంలో మట్టి, గ్రావెల్‌ రవాణా, బెల్టు షాపుల నిర్వహణ, పార్టీ పదవుల కేటాయింపుతో పాటు ఇతర అక్రమ దందాల్లో ఆధిపత్య పోరుతో పార్లమెంటు ప్రజాప్రతినిధి అంతా తానై వ్యవహరిస్తున్నారు. దీంతో నియోజకవర్గ ప్రజాప్రతినిధి, పార్లమెంట్‌ ప్రజాప్రతినిధి మధ్య విభేదాలు తలెత్తి తీవ్ర ఘర్షణలు ఏర్పడ్డాయి. పార్లమెంట్‌ ప్రజాప్రతినిధి అతని అనుచరులు చేస్తున్న అక్రమాలను నేరుగా నియోజకవర్గ ప్రజాప్రతినిధే మీడియా ముందు వెల్లడించడం గమనార్హం. ● నందిగామ నియోజకవర్గంలో మట్టి, ఇసుక అక్రమ రవాణాలో నియోజకవర్గ ప్రజాప్రతినిధి, పార్లమెంట్‌ ప్రజాప్రతినిధి వర్గం మధ్య కొంత కాలం వర్గపోరు నడిచింది. ఇద్దరూ వాటాల విషయంలో మాట్లాడుకొని సర్దు బాటు చేసుకున్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న అక్రమ దందాలను రెండు వర్గాలు కలిసి నడుపుతున్నాయి. ● జగ్గయ్యపేట నియోజకవర్గంలో మట్టి, ఇసుక అక్రమ రవాణాలో గతంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధి, పార్లమెంట్‌ ప్రజాప్రతినిధి వర్గం మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ తర్వాత రెండు వర్గాలు ఒక తాటిపైకి వచ్చి దందా కొనసాగిస్తున్నాయి.

చెలరేగుతున్న అధికార పార్టీ మట్టి మాఫియా

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అక్రమ సంపాదన కోసం ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే స్థాయికి చంద్రబాబు ప్రభుత్వంలో తెలుగు తమ్ముళ్లు దిగజారారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొండలను పిండి చేసి, చెరువులను చెరబట్టి, వాగులు, వంకలు, ఏరులు, నదులు ఇలా ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా మట్టి, గ్రావెల్‌, ఇసుక అక్రమ రవాణాకు తెరలేపి రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. అయాచితంగా వస్తున్న అక్రమ సంపాదన నేపథ్యంలోనే వారి మధ్య వివాదం మొదలైంది. వాటాల్లో తేడాలు రావడంతో పాటు అక్రమ దందాల్లో తమ పెత్తనమే సాగాలంటూ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్లమెంట్‌ ప్రజాప్రతినిధి, మాజీ మంత్రి వర్గం ఇలా మూడు వర్గాలుగా విడిపోయి ఒకరి గుట్టును మరొకరు సోషల్‌ మీడియా వేదికగా రట్టు చేస్తున్నారు. దీంతో పచ్చనేతల బాగోతం బహిరంగమైంది. అయినా వెనక్కు తగ్గని కొందరు అధికార పార్టీ నాయకులు సొంత పార్టీ నాయకులపైనే కేసులు నమోదు, అరెస్టులు చేయించడం చర్చనీయాంశంగా మారింది.

జిల్లా వ్యాప్తంగా తన్నులాటే..

ఎన్టీఆర్‌ జిల్లాలో టీడీపీలో వర్గపోరు మొదలైంది. మైలవరం నియోజకవర్గంలో ఇప్పటికే నియోజకవర్గ ప్రజాప్రతినిధి వర్గంతో పాటు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి, మాజీ మంత్రి వర్గం, జనసేన వర్గం మధ్య విభేదాలు తార స్థాయికి చేరాయి. నియోజకవర్గ ప్రజా ప్రతినిధి, అతని కుటుంబ సభ్యుల్లో ఒకరైన షాడో నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్న వ్యక్తి చేస్తున్న కమీషన్ల దందా, మట్టి, గ్రావెల్‌ తవ్వకాలను ప్రశ్నిస్తూ రెడ్డిగూడెం మండలానికి చెందిన తెలుగు యువత మండల మాజీ అధ్యక్షుడు ఉయ్యూరు వెంకటేశ్వర రెడ్డి, టీడీపీ సీనియర్‌ నేత ఉయ్యూరు రమేష్‌రెడ్డి ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో వీరిద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంతో పాటు కేసులు బనాయించి అరెస్టు చేయించారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధికి ఏమాత్రం తీసిపోకుండా పార్లమెంటు ప్రజాప్రతినిధి మైలవరంతో పాటు, విజయవాడ రూరల్‌ మండలంలో పెద్ద ఎత్తున అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement