బ్లాక్ మార్కెట్‌లో విక్రయించాలని సీఈఓపై చైర్‌పర్సన్ ఒత్తిడి 300 జిప్సం కట్టలకు ‘స్టాప్ సేల్’ ఆదేశాలు జారీ పీఏసీఎస్ అధికారులపై బెదిరింపులకు దిగిన చైర్‌పర్సన్ జిప్సం నిల్వల సూత్రధారి జనసేన పార్టీ నాయకుడు
కోడూరు: మండలం లోని వి.కొత్తపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీ ఎస్)లో భారీగా అక్రమ జిప్సం నిల్వలు బయటపడ్డాయి. ఎలాంటి ఇన్‌వాయిస్, ఓఫామ్, రవాణా పత్రాలు లేకుండా సుమారు 300 కట్టల జిప్సంను గోడౌన్‌లో నిల్వ ఉంచినట్లు తనిఖీల్లో తేలింది. సొసైటీ చైర్‌పర్సన్, జనసేన నాయకుడు రేపల్లె పిచ్చేశ్వరరావు బ్లాక్ మార్కెట్ నుంచి తెప్పించిన జిప్సంను రైతులకు విక్రయించాలని సొసైటీ సీఈఓ తోట శ్రీకాంత్‌పై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా విక్రయించలేనని సీఈఓ నిరాకరించడంతో చైర్‌పర్సన్ పిచ్చేశ్వరరావు ఆయనపై బెదిరింపులకు దిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సీఈఓ జిల్లా సహకార బ్యాంక్ సీఈఓ శ్యామ్ మనోహర్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన ఆదేశాల మేరకు కోడూరు కృష్ణా బ్యాంక్ సూపర్‌వైజర్ ఫణీంద్రబాబు విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా చైర్‌పర్సన్ స్పందించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది. ‘నా పీఏసీఎస్‌కు వచ్చి విచారణ చేయడానికి నువ్వు ఎవరు’ అంటూ సూపర్‌వైజర్‌పై కూడా చైర్‌పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
తనిఖీలు చేసిన వ్యవసాయ అధికారులు
విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ అధికా రులు వి.కొత్తపాలెం పీఏసీఎస్ గోదామును బుధవారం తనిఖీ చేశారు. ఏఓ శ్రీధర్ నేతృత్వంలో వీఏఏలు జిప్సం నిల్వలను పరిశీలించారు. ఎలాంటి రికార్డులు లేని 300 కట్టల జిప్సం నిల్వలు బయటపడటంతో వాటి విక్రయాలపై ‘స్టాప్ సేల్’ ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లో సంబంధిత ఓఫామ్‌లు, ఇతర ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏఓ తెలిపారు. జిప్సం నిల్వలు ఉన్న గోదాముకు తాళాలు వేసి విక్రయాలు జరపరాద్దంటూ నోటీసు అంటించారు. రైతులకు అందాల్సిన సబ్సిడీ జిప్సం స్థానంలో అక్రమంగా తెచ్చిన జిప్సం విక్రయించే ప్రయత్నాలు చేసేందుకు పూనుకున్న చైర్‌పర్సన్, జనసేన నాయకుడు పిచ్చేశ్వరరావు తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టు ద్వారా పదవి దక్కించుకొని చైర్‌పర్సన్ ఇలాంటి అక్రమలకు పాల్పడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.


