ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్‌ | - | Sakshi
Sakshi News home page

ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్‌

Jun 4 2026 7:09 AM | Updated on Jun 4 2026 7:09 AM

– ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): భారత ఎన్నికల కమిషన్‌ (ఈసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) నిర్వహిస్తామని, ఈ ప్రక్రియ విజయవంతానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ కోరారు. కలెక్టరేట్‌లోని శ్రీఏవీఎస్‌ రెడ్డి హాల్‌లో కలెక్టర్‌ లక్ష్మీశ అధ్యక్ష తన సర్‌పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం జరిగింది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు సంబంధించి జిల్లాస్థాయిలో కార్యాచరణను వివరించారు. కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లకు శిక్షణతో పాటు సన్నద్ధత కార్యకలాపాలు ఈ నెల ఐదు నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఎన్యూమరేషన్‌ ఫారాలను పోలింగ్‌ బూత్‌ స్థాయి బీఎల్‌ఓలకు అందజేసి ఈ నెల 15 నుంచి జూలై 14వ తేదీ వరకు సమాచారాన్ని సేకరిస్తామని తెలిపారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ జరుగుతాయని పేర్కొన్నారు. ఆ తర్వాత వీటిని పరిష్కరించి ఈ ఏడాది సెప్టెంబర్‌ 22న తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాలకు బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల (బీఎల్‌ఏ)ను నియమించుకోవాల్సిందిగా రాజకీయ పార్టీలను కోరారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను కలెక్టర్‌ నివృత్తి చేశారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 1,792 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. కొత్తగా 129 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలను పంపడం జరుగుతుందని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. సమావేశంలో డీఆర్‌ఓ ఎం.లక్ష్మీనరసింహం, ఎన్నికల డీటీ గోపాల్‌రెడ్డి, కలెక్టరేట్‌ సమన్వయ విభాగం అధికారి అనుష్‌కుమార్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement