మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షలు ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ ఘటనలు లేకుండా సజావుగా పూర్తయ్యాయని కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. ఎస్‌ఎస్‌సీ సప్లిమెంటరీ గణితం, ఓపెన్ స్కూల్ ఎస్‌ఎస్‌సీ శాస్త్ర–సాంకేతిక విజ్ఞానం, గృహ విజ్ఞాన శాస్త్రం పరీక్షలతో పాటు ఇంటర్మీడియెట్ భౌతిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం/పౌర శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాలను సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించినట్లు పేర్కొన్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 4 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, 3 ఏసీజీఈ బృందాలు విధులు నిర్వర్తించగా, మొత్తం 22 పరీక్ష కేంద్రాలను (15 ఎస్‌ఎస్‌సీ, 4 ఓపెన్ ఎస్‌ఎస్‌సీ, 3 ఓపెన్ ఇంటర్) తనిఖీ చేసినట్లు తెలిపారు. ఎస్‌ఎస్‌సీ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,787మంది విద్యార్థులు నమోదు కాగా, 1,297మంది హాజరయ్యారని, 490 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఈ పరీక్షలో హాజరు శాతం 72.58గా నమోదైందన్నారు. అలాగే ఓపెన్ స్కూల్ ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు 374 మంది విద్యార్థులు నమోదు కాగా, 290 మంది హాజరై 84 మంది గైర్హాజరయ్యారని, హాజరు శాతం 77.54గా ఉందని వెల్లడించారు. ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మొత్తం 527 మంది విద్యార్థులు నమోదు కాగా, 416 మంది హాజరై 111 మంది గైర్హాజరయ్యారని, హాజరు శాతం 78.94గా నమోదైనట్లు డీఈఓ తెలిపారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు
7,529 మంది హాజరు..
జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు ఇంటర్మీడియెట్ పరీక్షల అధికారి ఎస్. సరళకుమారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 8,338మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వారిలో 7,529మంది హాజరై, 809 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు.


