చందాలతో మరమ్మతులు చేసుకున్నాం
అవుట్‌ఫాల్ స్లూయిస్‌ల
అవుట్‌ఫాల్ స్లూయిస్‌ల ఆధునికీకరణకు సంబంధించి గత ఏడాది ప్రతిపాదనలు పంపించాం. వీటికి సంబంధించి ఎలాంటి అనుమతులూ రాలేదు. ఈ ఏడాది తూడు, గుర్రపుడెక్క తొలగింపునకు మాత్రమే నిధులు మంజూరు అయ్యాయి.
– బాబూ నాయక్, డ్రెయినేజీ డీఈ, చల్లపల్లి
స్థానిక శాసనసభ్యుడు బుద్ధప్రసాద్‌కు రైతులను పట్టించుకునే తీరిక లేదు. నియోజకవర్గానికి ఎక్కువ కాలం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఎప్పుడూ వీటిని పట్టించుకోలేదు. గత మా పాలనలో వీటి గురించి ప్రతిరోజూ విమర్శించే ఆయన ఇప్పుడు ఎందుకు నోరుమెదపరు. డెప్యూటీ సీఎం ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే రైతులు ఎవరికి చెప్పుకోవాలి.
– సింహాద్రి రమేష్‌బాబు,
మాజీ ఎమ్మెల్యే, అవనిగడ్డ
అవనిగడ్డ: కృష్ణాజిల్లాలో ఎనిమిదిచోట్ల అవుట్‌ఫాల్ స్లూయిస్‌లు శిథిలావస్థకు చేరాయి. వీటిని ఆధునికీకరిస్తేనే పంటపొలాలకు ముంపు ముప్పు నుంచి రక్షణ లభిస్తుంది. అయితే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. స్లూయిస్‌లను ఆధునికీకరిస్తా మని గత ఏడాది అక్టోబర్‌లో డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆధునికీకరణకు రూ.50 కోట్లతో అధికారులు అంచనాలు రూపొందించి పంపించారు. అయితే నిధులు మాత్రం మంజూరు కాలేదు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాదీ అవుట్‌ఫాల్ స్లూయిస్‌ల ఆధునికీకరణ లేనట్టేనని రైతులు వాపోతున్నారు. కనీస మరమ్మతులకు నోచుకోక పోవడంతో పలుచోట్ల సముద్రం నీరు పొలాల్లోకి చొచ్చుకొస్తోంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులే స్వచ్ఛం దంగా చందాలు సేకరించి మరమ్మతులు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
42 ఏళ్ల క్రితం స్లూయిస్‌ల నిర్మాణం
అధిక వర్షాలు కురిసినప్పుడు పంటపొలాల్లోని నీరు సముద్రంలోకి వెళ్లేలా, సముద్రం నీరు గ్రామాల్లోకి చొచ్చుకు రాకుండా ఉండేందుకు 42 సంవత్సరాల క్రితం నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం, కృత్తివెన్ను మండలాల్లో ఎనిమిదిచోట్ల సముద్రపు మొగ వద్ద అవుట్‌ఫాల్ స్లూయిస్‌లు నిర్మించారు. ప్రస్తుతం ఇవన్నీ పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఎక్కడా పనిచేయడం లేదు. ఈ ప్రాంతాల్లో ఉన్న అవుట్‌ఫాల్ స్లూయిస్‌ల మొత్తాన్ని ఆధునికీకరించి రైతులకు ముంపు ముప్పు లేకుండా చేస్తామని గత ఏడాది అక్టోబర్‌లో డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చారు. వీటికి సంబంధించి రూ.50 కోట్లకు అంచనాలు పంపినా నిధులు మంజూరు కాలేదు. దీంతో ఈ ఏడాది అవుట్‌ఫాల్ స్లూయిస్‌ల ఆధునికీకరణ లేనట్టేనని రైతులు పెదవి విరుస్తున్నారు. డెప్యూటీ సీఎం ఇచ్చిన హామీకే దిక్కులేక పోతే ఎలా పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు.
కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్‌లకు గత సంవత్సరం ఫైబర్ గేట్లు ఏర్పాటు చేశారు. అయితే వాటిని సరిగా బిగించలేదు. కింద ఉన్న గోతులు పూడ్చక పోవ డంతో గత ఏడాది పంటపొలాలు మునిగిపోయాయి. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. చేసేదేమీ లేక రైతులందం కలసి మూడు లక్షల రూపాయలు చందాలు వేసుకుని కాంక్రీట్ పనులు చేసుకున్నాం.
– కంచర్లపల్లి సుధాకర్, రైతు, కోడూరు
జిల్లాలో ఉన్న ఎనిమిది అవుట్‌ఫాల్ స్లూయిస్‌ల పరిధిలో మొత్తం 85 వేల ఎకరాల పంటపొలాలు ఉన్నాయి. స్లూయిస్‌లు అన్నీ శిథిలమవడంతో అధిక వర్షాలు కురిస్తే మురుగు నీరు దిగువకు పోయే పరిస్థితి లేదు. దీంతో ఈ ప్రాంతాల్లోని పంటపొలాలకు ముంపు ముప్పు పొంచిఉంది. కోడూరులో ఉన్న అవుట్‌ఫాల్ స్లూయిస్ పూర్తిగా దెబ్బతినడంతో గత ఏడాది రబ్బరు గేట్లు బిగించారు. ఇవి సక్రమంగా పనిచేయక పోవడంతో వేసిన వారం రోజులకే సముద్రం నీరు పంటపొలాలను ముంచెత్తింది. 1500 ఎకరాలు నీట మునగడంతో ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం పట్టించుకో పోవడంతో ఈ ఆయకట్టు పరిధిలోని రైతులు రూ.3 లక్షల చందాలు వేసుకుని మరమ్మతు చేయించుకున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అవుట్ ఫాల్ స్లూయిస్ లను ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.


