మచిలీపట్నంలో..
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనధికార విద్యుత్ కోతలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అనధికార విద్యుత్ కోతలు ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చిన్నపాటి గాలులు వీస్తే చాలు ఆ ప్రాంతంలో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. మండుతున్న ఎండలు, ఉక్కపోతకు అనధికార విద్యుత్ కోతలు తోడవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. దీనికి ప్రధాన కారణం నిర్వహణ లోపమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 220 కేవీ / 132 కేవీ ఈహెచ్‌టీ (ఎక్స్‌ట్రా హై టెన్షన్) లైన్లు, వాటి కింద ఉన్న ఫీడర్లలో ఓవర్‌లోడ్ పడితే ఆ ప్రాంతాల్లో అనధికార కోతలు విధిస్తున్నారని సమాచారం. ఓవర్ లోడ్ నమోదయ్యే ప్రాంతాల్లో ప్రభుత్వం ముందుగా కొత్త లైన్లు వేయకపోవడం, ఉన్న లైన్లను అప్‌గ్రేడ్ చేయకపోవడం, ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్ నిర్మాణాలు చేపట్టనందు వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గుణదల నుంచి ఆటోనగర్, గుణదల నుంచి గంగూరు, తాడికొండ నుంచి తాడేపల్లి 132 కేవీ లైన్ల పరిధిలో ఓవర్ లోడ్ కారణంగా వాటి పరిధిలోని ఫీడర్లలో అనధికారికంగా విద్యుత్ కోత విధిస్తున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు, రాత్రి 10 నుంచి 12 గంటల వరకు కోతలు విధిస్తున్నారు. జనవరిలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గరిష్ట వినియోగం రోజుకు 18 మిలియన్ యూనిట్లు. మంగళవారం విద్యుత్ వినియోగం 27.54 మిలియన్ యూనిట్లకు పెరి గింది. ఈ పెరుగుదలను ముందుగా అంచనా వేసి, దానికి అనుణంగా చర్యలు తీసుకోవడంలో విద్యుత్ శాఖ యంత్రాంగం పూర్తిగా విఫలం కావడంతో అనధికార కోతలు తప్పడం లేదు.
జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నియోజకవ ర్గంలో మచిలీపట్నం రూరల్ మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ప్రతి రోజూ పగలూ రాత్రి అన్న తేడా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. మచిలీపట్నం పట్టణ పరిధిలో చిన్నపాటి గాలులు వీచినా విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నారు. అసలే మండే ఎండలకు విద్యుత్ కోతలు తోడవ్వటంతో ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు.


