వక్కలగడ్డలో ..
ఉమ్మడి జిల్లాలో వడదెబ్బకు 11 మంది మృతి
గణపేశ్వరం(నాగాయలంక): ఉమ్మడి కృష్ణా జిల్లాలో వడగాలుల విలయం కొనసాగుతోంది. రోహిణీ కార్తెలో ఉగ్రోష్ణతలు నమోదవుతున్నాయి. వడగాడ్పులకు ఉమ్మడి జిల్లాలో మంగళవారం వేర్వేరు చోట్ల 11మంది మృతి చెందారు. గణపేశ్వరం శివారు బర్రంకులలో తోట గోపాలరావు(95) మంగళవారం వడదెబ్బ తగిలి మరణించినట్లు కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు మండల తహసీల్దార్‌కు తెలియపర్చినట్లు వీఆర్వో జయరామ్ తెలిపారు. వడదెబ్బ తగిలి వృద్ధుడు మృతి చెందిన సమాచారంపై తహసీల్దార్ సీహెచ్‌వీ ఆంజనేయప్రసాద్ వివరణ కోరగా వడదెబ్బకు మృతి చెందినట్లు త్రీమెన్ కమిటీ నిర్ధారించవలసి ఉందని, పోస్ట్‌మార్టమ్ కు పంపించాలని సూచించామన్నారు. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని నాగాయలంక ఎస్‌ఐ కె.రాజేష్ చెప్పారు.
హనుమాన్‌జంక్షన్ రూరల్: చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై బాపులపాడు మండలం కె.సీతారామపురం వద్ద వడదెబ్బకు ఓ మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. జంక్షన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దెందులూరు మండలం సత్యనారాయణపురానికి చెందిన యార్లగడ్డ శిరీష (47) మతస్థిమితం కోల్పోవడంతో ఇంటి నుంచి సోమవారం వెళ్లిపోయింది. జాతీయ రహదారి వెంట వస్తుండగా వేసవి ఎండ తీవ్రతకు అలసటతో కె.సీతారామపురం వద్ద డివైడర్‌పై కూర్చుంది. అక్కడే స్పృ తప్పి పడిపోవటంతో స్థానికులు గుర్తించి జంక్షన్ పోలీసులకు సమాచారం అందించారు. వారు పరిశీలించగా అప్పటికే మహిళ మృతి చెందింది. తొలుత మృతురాలు వివరాలు తెలియకపోవడంతో గుర్తు తెలియని మహిళగా కేసు నమోదు చేశారు.ఆ తర్వాత మృతురాలి ఫొటోను పోలీసులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా, కుటుంబ సభ్యులు గుర్తించారు.
మల్లవల్లిలో..
బాపులపాడు మండలం మల్లవల్లిలో వేసవి వడగాల్పుల ధాటికి శతాధిక వృద్ధురాలు తూము ఈశ్వరమ్మ (101) సోమవారం రాత్రి మృతి చెందారు. అధిక ఉష్ణోగ్రతల ధాటికి ఈశ్వరమ్మ తట్టుకోలేక సాయంత్రానికి పూర్తిగా నిరసించిందని,ఆ తర్వాత మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
గన్నవరం: వడదెబ్బకు గురై ఓ గుర్తుతెలియని వ్యక్తి తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై గన్నవరం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం ఈ నెల 23వ తేదీ మండలంలోని ముస్తాబాదలో వడదెబ్బకు గురై సుమారు 55 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు పక్కన పడిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్‌లో విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 25న మృతి చెందినట్లు ఎస్‌ఐ ప్రశాంతి తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు గన్నవరం పీఎస్‌లో సంప్రదించాలని కోరారు.
ఉంగుటూరు(గన్నవరం): నాగవరప్పాడు గ్రామంలో ఓ గుర్తుతెలియని మహిళ వడదెబ్బకు గురై మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నాగవరప్పాడులోని బస్ షెల్టర్‌లో సుమారు 30 నుంచి 35 ఏళ్లు వయస్సు కలిగిన మహిళా మృతి చెంది ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎండల తీవ్రత, వడగాలుల కారణంగా సదరు మహిళా మృతి చెందినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. మృతురాలికి సంబంధించిన ఆచూకీ తెలియరాలేదని, మృతురాలు ఎరుపు రంగుపై పసుపు రంగు పువ్వులు కలిగిన పంజాబీ డ్రస్, గ్రే కలర్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతురాలు సంబంధించి వారు ఉంగుటూరు పీఎస్‌లో సంప్రదించాలని కోరారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు
చల్లపల్లి మండలంలో ..
చల్లపల్లి: లక్ష్మీపురం శివారు చింతలమడ గ్రామానికి చెందిన చిగురుపాటి నల్లమ్మ(67) విపరీతమైన ఎండలు, వడగాలులు కారణంగా వడదెబ్బకు గురైంది. వృద్ధాప్యంలోనే తన పనులు తానే చేసుకుంటుంది. అయితే సోమవారం సాయంత్రం నుంచి వంట్లో బాగోలేదని, నీరసంగా, ఆయాసంగా ఉందని చెప్పి కదలకుండా పడుకొంది. మంగళవారం ఉదయం నల్లమ్మ పరిస్థితి విషమించింది. వెంటనే ఆమెను చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం సమయానికి నల్లమ్మ మృతి చెందింది. ఆమెతో కలిపి చల్లపల్లి మండలంలో వడదెబ్బకు గురై మృతి చెందిన వారి సంఖ్య ముగ్గురికి చేరుకుంది.
పటమటలో..
పటమట(విజయవాడతూర్పు): వడదెబ్బతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పటమట పీఎస్ సీఐ పవన్ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం సుమారు 50 నుంచి 55 సంవత్సరాలు మధ్య ఉన్న వ్యక్తి మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆటోనగర్ బస్‌స్టాండ్ (సిటీ టెర్మినల్) వెనుక వైపున వడదెబ్బ కారణంగా పడిపోయి చనిపోయాడు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిస్తే పటమట పీఎస్‌లో తెలియజేయాలని లేదా 7416812304, 9494918585 ఫోన్ నంబర్లుకు సమాచారం అందించాలని కోరారు.
ఉయ్యూరు: వడగాడ్పులకు గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఉయ్యూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాతీయ రహదారికి సమీపంలోని జియో పెట్రోలు బంకు వెనుక ఖాళీ ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వడదెబ్బకు మృతి చెంది ఉంటాడని, మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల్లు ఉంటాయని, కాఫీ రంగు ప్యాంటు ధరించాడని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియరాలేదని సీఐ రామారావు తెలిపారు.
కాటూరు రోడ్డులో..
పట్టణంలోని కాటూరు రోడ్డులో ఫుట్‌పాత్‌పై ఓ యాచకురాలు మృతి చెందింది. ఫుట్‌పాత్‌పై యాచకురాలి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
చల్లపల్లి: మండల పరిధిలోని వక్కలగడ్డలో మరో వృద్ధురాలు అడ్డాడ రవంబ(90) వడదెబ్బతో సోమవారం రాత్రి మృతి చెందింది. ఆమె అంత్యక్రియలను కుటుంబ సభ్యులు మంగళవారం నిర్వహించారు. వయస్సు 90 సంవత్సరాలైనా రవంబ యాక్టివ్‌గా ఉండేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
గూడూరు: మండలం రాయవరంలో వడగాలులకు వృద్ధుడు మరణించాడు. గ్రామానికి చెందిన నారగం వీర వెంకట సత్యనారాయణ(60) మంగళవారం మృతి చెందాడు. వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే సత్యనారాయణ ఎండ వేడికి తాళలేక తనువు చాలించాడు.


