ప్రసవించిన 15 గంటల్లోనే బాలింత మృతి మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత వైద్యుల నిర్లక్ష్యం అంటూ మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళన
మచిలీపట్నంఅర్బన్: మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవానంతరం బాలింత మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని వాసవి భవనం ప్రాంతానికి చెందిన హరిత (30) సోమవారం సాయంత్రం ఆడబిడ్డకు జన్మనిచ్చి, మంగళవారం ఉదయం సుమారు 4 గంటల సమయంలో మృతి చెందింది. ప్రసవం జరిగిన సుమారు 15 గంటల్లోనే బాలింత మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) ఆస్పత్రికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
రెండో ప్రసవానికీ అదే ఆస్పత్రి
మచిలీపట్నం ప్రాంతానికి చెందిన హరితకు మొదటి ప్రసవం కూడా మూడేళ్ల క్రితం మచిలీ పట్నం సర్వజన ఆస్పత్రిలోనే జరిగింది. రెండో ప్రసవం కోసం కూడా కుటుంబ సభ్యులు అదే ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు. సిజేరియన్ అనంతరం సరైన వైద్య సదుపాయాలు అందలేదని ఆరోపిస్తున్నారు.
కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం హరితకు సిజేరియన్ తర్వాత ఐసీయూకు తరలించకుండా సాధారణ వార్డుకు మార్చారని తెలిపారు. ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వైద్యులు మరోసారి ఆపరేషన్ చేశారని, అయినా ఫలితం లేదని వాపోయారు. వైద్యుల నిర్లక్ష్యమే బాలింత మృతికి కారణమని ఆరోపిస్తూ కన్నీరు మున్నీరయ్యారు.
పల్మనరీ ఎంబోలిజం కారణమై ఉండొచ్చు
ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి.లీలాప్రసాద్ స్పందిస్తూ, హరితకు సిజేరియన్ అనంతరం ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా విషమించిందన్నారు. ఇంటర్నల్ బ్లీడింగ్ అనుమానంతో మళ్లీ ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. పల్మనరీ ఎంబోలిజం వంటి అరుదైన పరిస్థితి కారణంగా మృతి చెంది ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్‌కు ముందు ఆమెకు ఎటువంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కనిపించలేదని, అందువల్ల సాధారణ వార్డులో ఉంచినట్లు వివరించారు. డాక్టర్ల నిర్లక్ష్యం లేదని ఘటనపై కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. నర్సింగ్ సిబ్బంది కొరత ఉందని పేర్కొన్నారు.
పాలకులు మొద్దు నిద్ర వీడాలి: పేర్ని కిట్టు
ఈ ఘటనపై వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) స్పందిస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు వైద్య సేవలు దూరమవుతున్నాయనే దానికి ఈ ఘటన నిదర్శనమని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర ప్రచారాలకే పరిమితమవుతున్నారని, వైద్య సేవలపై సరైన దృష్టి సారించడం లేదని ఆరోపించారు. కలెక్టర్ జోక్యం చేసుకుని ఇక్కడ సిబ్బంది కొరతను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.


