సుడాకు అండదండలేవీ?! | - | Sakshi
Sakshi News home page

సుడాకు అండదండలేవీ?!

Jun 12 2026 12:11 AM | Updated on Jun 12 2026 12:11 AM

అథారిటీ ఏర్పడి ఏళ్లు దాటుతున్నా

కరువైన ప్రత్యేక సిబ్బంది

78 పోస్టుల కోసం

ప్రభుత్వానికి రెండుసార్లు నివేదిక

ఫలితం లేక కేఎంసీ ఉద్యోగులతోనే నెట్టుకొస్తున్న వైనం

సొంత కార్యాలయం కూడా లేక ఇక్కట్లు

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను ప్రణాళికాయుతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ‘సుడా’ (స్తంబాద్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఏర్పాటై పదేళ్లు కావొస్తున్నా ఇంకా బాలారిష్టాలు వీడడం లేదు. పాలక మండళ్లు మారుతున్నా, చైర్మన్లు బాధ్యతలు స్వీకరిస్తున్నా పాలన సాఫీగా సాగేల సొంత ఉద్యోగి ఒక్కరు లేకపోవడం గమనార్హం. ఫలితంగా ఖమ్మం నగరపాలక సంస్థ (కేఎంసీ) అధికారులే ఇటు కార్పొరేషన్‌, అటు సుడా బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తోంది. ఇక సుడా పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం 2024 అక్టోబర్‌లో ఉత్తర్వులు జారీ చేసినా అనుమతులు విడుదల చేయకపోవడంతో పాత పరిధిలోనే పాలన సాగుతోంది.

ఆ ఉద్యోగులే అటూఇటు..

గత ప్రభుత్వం 2017లో ‘సుడా’ను ఏర్పాటుచేసి పాలక మండలిని నియమించింది. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే గత కమిటీని రద్దుచేయగా, ఇటీవలే నూతన చైర్మన్‌ను నియమించారు. ఇలా నియామకాలు జరుగుతున్నా క్షేత్రస్థాయిలో పని చేసే యంత్రాంగం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో పనులు సాగడం లేదు. నిబంధనల ప్రకారం సుడా వైస్‌ చైర్మన్‌గా కేఎంసీ కమిషనర్‌ వ్యవహరిస్తున్నారు. అంతేకాక కార్పొరేషన్‌కు చెందిన టౌన్‌ ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌, అకౌంట్స్‌, ఎస్టాబ్లిస్‌మెంట్‌ విభాగాల ఉద్యోగులే సుడా కార్యకలాపాలను కూడా అదనంగా నిర్వర్తిస్తుండడంతో వారిపై భారం పడుతోంది. అటు కార్పొరేషన్‌ పనులు చేస్తూనే, ఇటు సుడా పరిధిలోని లే ఔట్లు, భవన నిర్మాణ అనుమతుల పరిశీలనకు ఆటంకం కలుగుతోంది.

రాబడి పెరిగినా..

సుడా పరిధిలోని గ్రామాల్లో భవన నిర్మాణాలు, లే ఔట్లకు ఏర్పాటుకు అనుమతుల ద్వారా ఏటా రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది. ఒకవేళ ప్రత్యేకంగా అధికారులు, సిబ్బందిని కేటాయిస్తే నిరంతరం పర్యవేక్షిస్తూ అక్రమ లేఔట్లను అడ్డుకుంటే రాబడి రెట్టింపు అవుతుంది. పొరుగున ఉన్న వరంగల్‌ జిల్లాకు చెందిన ‘కుడా’(కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)కు ప్రభుత్వం ప్రత్యేక పోస్టులు మంజూరు చేయడంతో పాలన సాఫీగా సాగుతోంది. కానీ ‘సుడా’ విషయంలో ఆ చొరవ లేక ఇక్కట్లు ఎదురవుతున్నాయి.

రెండుసార్లు ప్రతిపాదనలు

పరిపాలన సజావుగా సాగడానికి ఐదు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి, కనీసం 78 పోస్టులు మంజూరు చేయాలని గత ప్రభుత్వానికి ఓ సారి, ప్రస్తుత ప్రభుత్వానికి మరోసారి నివేదికలు పంపినట్లు తెలుస్తోంది. ప్లానింగ్‌, డెవలప్‌మెంట్‌, అర్బన్‌ ఫారెస్ట్రీ, అడ్మిన్‌/అకౌంట్స్‌, భూసేకరణ విభాగాలను ఏర్పాటు చేయాలని ఇందులో పేర్కొన్నారు. అయినా పోస్టుల మంజూరుపై సానుకూల స్పందన రాలేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, ప్రత్యేక పోస్టులను సృష్టించి ఉద్యోగులను నియమిస్తేనే సార్ధకత ఉంటుందని స్థానికులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈసారి కూడా...

గత పాలకవర్గ హయాంలో కేఎంసీ ఉద్యోగులను ‘సుడా’లో విధినిర్వహణకు కేటాయించారు. తాజాగా చైర్మన్‌ను నియమించగా, పోస్టులు మంజూరు కాకపోవడంతో ఉన్నతాధికారులు మరోసారి కేఎంసీ వైపే చూశారు. ఈమేరకు కేఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సెక్షన్‌ నుంచి సీపీఓ రాజ్‌కుమార్‌, ఇంజనీరింగ్‌ సెక్షన్‌ నుండి డీఈఈ వి.నరేందర్‌, మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ షమ, అకౌంట్స్‌ విభాగం నుంచి అకౌంట్స్‌ ఆఫీసర్‌ చింత శ్రీనివాసరెడ్డి, సీనియర్‌ అకౌంటెంట్‌ ఏ.ఉపేందర్‌రావు, ఎస్టాబ్లిష్‌మెంట్‌ విభాగం నుంచి మేనేజర్‌ జి.శ్రీనివాసరావు, టైపిస్ట్‌ చంద్రహాసినికి అదనపు బాధ్యతలు కేటాయించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement