రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ చేయండి | - | Sakshi
Sakshi News home page

రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ చేయండి

Jun 16 2026 12:28 AM | Updated on Jun 16 2026 12:28 AM

రాయచూరు రూరల్‌: జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు విక్రయించిన జొన్నల డబ్బుల బకాయిలను వారి ఖాతాల్లోకి జమ చేయాలని ఎమ్మెల్సీ బాదర్లి బసవనగౌడ డిమాండ్‌ చేశారు. సోమవారం బెంగళూరులోని ఆహార పౌర సరఫరాల శాఖాధికారితో చర్చించారు. ఆరు నెలల క్రితం రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా జొన్నలు విక్రయించిన రైతులకు ఇంత వరకు రైతుల బ్యాంక్‌ల ఖాతాలోకి డబ్బులు వేయలేదన్నారు. ఇప్పటికై నా నిర్లక్ష్యం చేయకుండా త్వరిత గతిన డబ్బులు చెల్లించాలని అధికారులను కోరారు.

రైతుల బకాయి సొమ్ము

చెల్లించాలని రాస్తారోకో

రాయచూరు రూరల్‌: జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు విక్రయించిన జొన్నల డబ్బులు ఖాతాలోకి జమ చేయాలని కర్ణాటక రైతు సంఘం డిమాండ్‌ చేసింది. సోమవారం సింధనూరు తాలూకా యాపలపర్వి వద్ద రాయచూరు–సింధనూరు రహదారిని బంద్‌ చేసి చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు అమీన్‌పాషా దిద్దిగి మాట్లాడారు. జిల్లాలో రైతుల ఆత్మహత్యల నియంత్రణకు స్వామినాథన్‌ నివేదికను అమలు చేయాలన్నారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధరలను ప్రకటించాలన్నారు. నకిలీ పత్తి విత్తనాల విక్రయాలకు అవకాశం కల్పించకుండా చర్యలు చేపట్టాలన్నారు. మార్కెట్‌ ధరలకే విత్తనాలు, ఎరువులు విక్రయాలు జరిపేలా చూడాలన్నారు. ఎరువుల కొరత రాకుండా చూడాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. రామయ్య, తిమ్మన్న, చెన్నప్ప, వెంకటేష్‌, ఖాసీం, నరసింగ్‌రావ్‌లున్నారు.

విద్యుత్‌ రంగ ప్రైవేటీకరణ తగదు

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం మేరకు విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం మానుకోవాలని కర్ణాటక విద్యుత్‌ ప్రసార మండలి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బసవణ్ణ ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను డిమాండ్‌ చేశారు. సోమవారం బెంగళూరులోని కార్యాలయంలో వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో విద్యుత్‌ సరఫరా, పంపిణీ బాధ్యతలను టాటా పవర్‌ కంపెనీకి అప్పగించే ముందు కేపీటీసీఎల్‌ అధికారులతో చర్చించి, తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించాలన్నారు. బలరాం, చంద్రశేఖర్‌ దేశాయిలున్నారు.

బాలల రక్షణ కమిటీని

రద్దు చేయండి

రాయచూరు రూరల్‌: జిల్లాలో నియమించిన బాలల హక్కుల రక్షణ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని జనపర సంఘటన వేదిక డిమాండ్‌ చేసింది. సోమవారం మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో వేదిక అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ మాట్లాడారు. జిల్లాలో బాలల హక్కుల రక్షణ కమిటీ అధ్యక్షుడిగా సింధనూరు సత్యనారాయణ శెట్టి, సభ్యునిగా బీదర్‌ జగన్నాథ్‌లను నియమిస్తూ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. జయశ్రీ, శరణ బసవ, మారెమ్మ, తాయప్ప, మల్లేష్‌, రామణ్ణ, కిరణ్‌ కుమార్‌, నీలమ్మ, అమరమ్మలున్నారు.

పెద్దలను గౌరవించాలి

రాయచూరు రూరల్‌: నేటి ఆధునిక సమాజంలో పెద్దలను గౌరవించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ సిద్రామప్ప పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం భవనంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా న్యాయ సేవా ప్రాధికార, దివ్యాంగుల శాఖ, సీనియర్‌ సిటిజన్‌, రోటరీ క్లబ్‌, కృష్ణా తుంగ సంయుక్త ఆధ్వర్వంలో ప్రపంచ సీనియర్‌ సిటిజన్లపై వివక్ష అనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. సీనియర్‌ సిటిజన్లపై దాడి చేసినట్లు కేసులు నమోదైన 60 నుంచి 90 రోజుల్లో వాటిని పరిష్కరించాలన్నారు. పెద్దల ఆస్తులను తీసుకుని వారిని క్షేమంగా చూడకపోతే వారి ఆస్తులను తిరిగి పొందడానికి వీలుగా చట్టం జారీ చేశారన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ హంపణ్ణ, శరణమ్మ, సరస్వతి, పవన్‌ పాటిల్‌, లక్ష్మికాంతరెడ్డి, వీరభద్రప్ప, భాస్కర్‌, శ్రీదేవిలున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement